- ఈవీఎంలు, ఓట్ చోరీ పేరుతో ఈసీని బద్నాం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర.
- సర్ సాధారణ ప్రక్రియే
- అక్రమ వలసదారుల ఓట్ల కోసమే కాంగ్రెస్ ఆరాటం
- బ్యాలెట్ పేపర్లతో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారు
- తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలపై ఉద్యమాలు ఉధృతం చేస్తాం
- 2028లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్
హైదరాబాద్, మహా : ఎన్నికల్లో ప్రజామోదంతో గెలవలేక, వరుస ఓటములను జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థల విశ్వసనీయతపైనే విషం చిమ్ముతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలపైనా, ఓట్ల చోరీపైనా, కేంద్ర ఎన్నికల సంఘంపైనా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వ్యవస్థలను కించపరుస్తోందని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కోట్లాది మంది ప్రజల దీవెనలతో గెలిచిన బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుడు మార్గంలో గెలిచినట్లు చిత్రీకరించేందుకు కాంగ్రెస్ నిరంతరం దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను పరిశీలిస్తే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రామ్ మాధవ్ గుర్తుచేశారు. 1975లో అలహాబాద్ హైకోర్టు ఇందిరా గాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని తీర్పునిస్తే, ఆమె రాజీనామా చేయకుండా దేశంలో అత్యవసర పరిస్థితి విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. అదేవిధంగా 1987లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లాతో కలిసి ఎన్నికల్లో తీవ్ర అవకతవకలకు పాల్పడటం వల్లే అక్కడ తీవ్రవాదం పెచ్చరిల్లిందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నేడు ప్రజల మద్దతుతో గెలుస్తున్న బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్లో విధానపరమైన చర్చలకు ఆహ్వానిస్తే హాజరుకాకుండా విదేశాలకు వెళ్లిపోయే రాహుల్ గాంధీ, రోడ్లపై నిలబడి రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకుని అవాస్తవాలను ప్రచారం చేస్తోందన్నారు. దేశంలో 1952 నుంచి ఇప్పటివరకు 11 సార్లు ఎలక్టోరల్ రోల్స్ రివిజన్ జరిగిందని, చివరిసారిగా 2004లో జరిగితే గత 20 ఏళ్లుగా ఈ ప్రక్రియ జరగలేదని గుర్తుచేశారు. బదిలీ అయినవారు, మరణించినవారు, నకిలీ ఓటర్లు, అక్రమ వలసదారుల పేర్లను తొలగించడం ఎన్నికల సంఘం బాధ్యతన్నారు. గతంలో కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన ఇంద్రజిత్ గుప్తా స్వయంగా దేశంలో కోటి 20 లక్షల మంది అక్రమ చొరబాటుదారులు ఉన్నారని పార్లమెంట్లో వెల్లడించారని గుర్తు చేశారు. ఆ అక్రమ ఓట్లను కాపాడుకుని రాజకీయ లబ్ధి పొందడమే కాంగ్రెస్ ఉద్దేశమని, అందుకే ఈ సవరణ ప్రక్రియపై అనవసర గగ్గోలు పెడుతోందని విమర్శించారు.
ఈవీఎంలను బూచిగా చూపిస్తూ బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరపాలంటున్న కాంగ్రెస్ వాదనను ప్రజలు ఇప్పటికే తిప్పికొట్టారన్నారు. అస్సాంలోని సిల్చార్ మున్సిపల్ కార్పొరేషన్లో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగితే మొత్తం 42 స్థానాల్లో బీజేపీ 34 గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం 2 స్థానాలకే పరిమితమైందని గుర్తుచేశారు. నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్ విధానంలో జరిగిన 28 ఎమ్మెల్సీ (గ్రాడ్యుయేట్ & టీచర్స్) స్థానాల్లో బీజేపీ 16 గెలిస్తే, కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైందని, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి సున్నా ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో 23 పార్టీలు కలిసి సభపెడితే కనీసం 50 వేల మందిని కూడా సమీకరించలేక కుర్చీలు ఖాళీగా కనిపించాయని, సభ విఫలమైనందుకు తమ సొంత నేతలను సస్పెండ్ చేసుకునే దయనీయ స్థితికి కాంగ్రెస్ చేరిందని దుయ్యబట్టారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలు, అవినీతి, తప్పుడు ప్రచారాలను క్షేత్రస్థాయిలో ఎండగడతామని రామ్ మాధవ్ స్పష్టం చేశారు. ఇటీవల భాగ్యనగరంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నేతృత్వంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న పాదయాత్రకు, అలాగే నిర్మల్ మహాపాదయాత్రకు వేలాదిగా ప్రజలు తరలివచ్చి మద్దతు ప్రకటించారని తెలిపారు. 1990 నుంచే సుష్మా స్వరాజ్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడి తీర్మానం చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు.
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న పార్టీ అధినేత రాజకీయంగా ‘ఐరన్ లెగ్’గా మారారని రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు. గతంలో దేశమంతా తిరిగి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ ఎవరినైతే కలిశారో-బెంగాల్లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్, చివరకు ఏపీలో జగన్ మోహన్ రెడ్డి లాంటి నేతలంతా ఓటమి చవిచూశారని, ఆ జాబితాలో చివరకు స్వయంగా ఆయన కూడా అధికారం కోల్పోయి ప్రజల చేతిలో ఔట్ అయ్యారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలకు ఏకైక తిరుగులేని ప్రత్యామ్నాయం బీజేపీయేనని, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, తప్పిదాలు, దుర్మార్గ పాలనను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రజల్లో ఎండగడతామని స్పష్టం చేశారు. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ సమస్యలను వదిలేసి సగం కాలం అమెరికా, యూరప్‌లలో గడుపుతుంటే, మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి పాలనను గాలికొదిలేసి ఢిల్లీ పర్యటనలకే పరిమితమయ్యారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.







