Mahaa Daily Exclusive

  ఆంక్షలతో కాలుష్యం తగ్గదు.. జనం తీరు మారాలి!

Share

  •  ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు.

న్యూఢిల్లీ, మహా.

దేశ రాజధాని ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రాణాంతక వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం ప్రభుత్వాలు విధించే ఆంక్షలు, జారీ చేసే ఉత్తర్వులతో ఈ కాలుష్య మహమ్మారికి చెక్ పెట్టలేమని, ప్రజల రోజువారీ జీవన విధానంలో, ఆలోచనా తీరులో బాధ్యతాయుతమైన మార్పు వచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుందని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఢిల్లీ-ఎన్‌సీఆర్ వాయు కాలుష్యంపై విచారణ చేపట్టి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. విచారణ ప్రారంభంలోనే ఢిల్లీ వాతావరణాన్ని మీరంతా ఆస్వాదిస్తున్నారని ఆశిస్తున్నామంటూ ధర్మాసనం న్యాయవాదులను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

ప్రస్తుత రోజుల్లో పండుగల వాణిజ్యీకరణ పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తోందని జస్టిస్ బాగ్చీ అభిప్రాయపడ్డారు. దీపావళి లాంటి పండుగలను హానికారక రసాయనాలతో కూడిన టపాసులతో కాకుండా, మునుపటిలా సంప్రదాయబద్ధంగా పర్యావరణ హితంగా ఎందుకు జరుపుకోలేకపోతున్నామని ధర్మాసనం ప్రశ్నించింది. ఇదే సమయంలో, కాలుష్య సమస్యకు పేదలే కారణమంటూ నిందించడాన్ని సీజేఐ తీవ్రంగా తప్పుబట్టారు. కాలుష్యాన్ని సృష్టించడంలో పేదల పాత్రను భూతద్దంలో చూపించడం సరికాదని, వాస్తవానికి ఈ కాలుష్య కోరల్లో చిక్కుకుని అత్యధికంగా నష్టపోతున్నది, ప్రాణాలు కోల్పోతున్నది ఆ పేదలేనని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. సంపన్నులు తమ ఇళ్లలో వినియోగించే విలాసవంతమైన కార్లు, ప్రైవేట్ వాహనాలు ఏ స్థాయిలో వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయో గుర్తుంచుకోవాలని చురకలంటించారు.

ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో రవాణా రంగం కాలుష్యానికి ప్రధాన కేంద్రంగా మారిందని అమికస్ క్యూరీ అపరాజితా సింగ్ విచారణలో కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి తోడు పంజాబ్, హర్యానా తదితర పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఢిల్లీ కాలుష్యంలో సుమారు 14 శాతం వాటా ఆ పొగదే ఉంటోందని వివరించారు. దీనిపై స్పందించిన కోర్టు.. పంట వ్యర్థాలను రైతులు కాల్చకుండా ఉండేందుకు, వాటిని ముందుగానే సేకరించేలా తగిన కనీస కొనుగోలు ధరను ప్రభుత్వాలు ప్రకటించాలని సూచించింది. ఈ వ్యర్థాల నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగిస్తే క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడింది. వాహనాల నుంచి వెలువడే పొగ, బహిరంగంగా చెత్త దహనం వంటి స్థానిక కారకాల నియంత్రణపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించింది.

కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ.. కాలుష్య నియంత్రణకు తాము తీసుకుంటున్న కఠిన చర్యలను కోర్టుకు వివరించారు. బీఎస్-6 ప్రమాణాలు లేని వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించామని, డీజిల్ ఆటోలను దశలవారీగా తగ్గిస్తూ ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. అయితే, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) ఏకంగా 400 స్థాయికి చేరుతుండటంపై ప్రధాన న్యాయమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కట్టుదిట్టమైన చర్యలతో పాటు, పౌరుల్లో పర్యావరణ స్పృహ పెరిగి బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ఢిల్లీ లాంటి నగరాలు ఈ గ్యాస్ చాంబర్ సంక్షోభం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని ధర్మాసనం తేల్చిచెప్పింది.