సరిహద్దుల్లో భారీ ఆయుధ డంప్ కలకలం.
* ఏకంగా 711 గ్రెనేడ్ లాంచర్ షెల్స్ పట్టివేత!
బీజాపూర్,మహా.
ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పన్నిన భారీ మందుగుండు కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. సరిహద్దులోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అత్యంత పకడ్బందీగా, రహస్యంగా దాచిపెట్టిన భారీ ఆయుధ డంప్‌ను పోలీసులు తాజాగా వెలికితీశారు. బీజాపూర్ జిల్లా పరిధిలో నిర్వహించిన సంయుక్త గాలింపు ఆపరేషన్‌లో ఏకంగా 711 బారెల్ గ్రెనేడ్ లాంచర్ (బీజీఎల్) షెల్స్‌ను స్వాధీనం చేసుకోవడం భద్రతా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పక్కా నిఘా సమాచారం మేరకు జిల్లా పోలీసు బలగాలు, కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలకు చెందిన 196వ బెటాలియన్, ప్రతిష్ఠాత్మక కోబ్రా 204వ బెటాలియన్ జవాన్లు సంయుక్తంగా ఈ భారీ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడపాల గ్రామ సమీపంలో బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో తాడపాల ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌కు వాయువ్య దిశలో సుమారు కిలోమీటరున్నర దూరంలో ఉన్న కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో ఈ భారీ ఆయుధ నిల్వలు బయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న 711 గ్రెనేడ్ షెల్స్‌ను నిర్దేశిత భద్రతా ప్రమాణాల ప్రకారం పోలీసులు అత్యంత సురక్షిత ప్రాంతానికి తరలించారు. బారెల్ గ్రెనేడ్ లాంచర్ షెల్స్ అత్యంత శక్తివంతమైన, ప్రాణాంతకమైన పేలుడు పదార్థాలు. వీటి ప్రయోగం వల్ల బరువైన వాహనాలు, భవనాలు, మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు భారీగా ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉంటుంది. సరిహద్దు అడవుల్లో ఇంత పెద్ద సంఖ్యలో మందుగుండు దొరకడం, మావోయిస్టులు గతంలో ఈ ప్రాంతాన్ని ఏ స్థాయిలో తమ స్థావరంగా ఉపయోగించుకున్నారో స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు మావోయిస్టు అగ్రనేతలకు కర్రెగుట్టలు అత్యంత కీలక విడిదిగా ఉండేవి. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఇదే దట్టమైన అడవుల్లో భద్రతా బలగాలు ఏకధాటిగా 21 రోజుల పాటు జరిపిన భారీ కూంబింగ్ ఆపరేషన్‌లో ఏకంగా 31 మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. ఆ ఆపరేషన్ అనంతరం తాడపాల సమీపంలో పోలీసులు శాశ్వత భద్రతా శిబిరాన్ని ఏర్పాటు చేసి నిఘా పెంచారు.
తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు సరిహద్దు గ్రామ ప్రజలను తీవ్రంగా హెచ్చరించారు. కర్రెగుట్టలు, దాని పరిసర కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లోకి ప్రజలు, గిరిజనులు, పశువుల కాపరులు ఎవరూ ప్రస్తుతానికి వెళ్లవద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రాంతంలో ఇంకా పట్టుబడని మందుపాతరలు, పేలని ఐఈడీలు (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లు), ఇతర ప్రమాదకర పేలుడు పదార్థాలు భూమిలో పాతిపెట్టి ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాన్ని అంగుళం అంగుళం గాలించి, పూర్తిస్థాయిలో సురక్షితంగా మార్చేందుకు త్వరలోనే ప్రత్యేక డీమైన్ ఆపరేషన్ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. మావోయిస్టుల కార్యకలాపాలకు చెక్‌పెట్టే దిశగా బలగాలు అడుగులు వేస్తున్న తరుణంలో, ఈ భారీ ఆయుధ డంప్ లభ్యం కావడం సరిహద్దు భద్రతా చర్యల ఆవశ్యకతను మరోసారి గుర్తుచేస్తోంది.







