Mahaa Daily Exclusive

  తెలంగాణలో ఈవీ రంగాలకు రెడ్ కార్పెట్!

Share

తెలంగాణలో ఈవీ రంగాలకు రెడ్ కార్పెట్!
* పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు.
* నవంబర్ 11న మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన తొలి సమావేశం

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు తీయించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యంగా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రంగాల్లో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలను రాష్ట్రానికి రప్పించడం, నూతన పెట్టుబడులకు రహదారులు వేయడం, ప్రస్తుతం ఉన్న పరిశ్రమల విస్తరణకు పూర్తిస్థాయిలో సహకారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌–2026’ సన్నాహకాల్లో భాగంగా ఆటోమోటివ్, ఈవీ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ప్రతిష్ఠాత్మక కౌన్సిల్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు.
నవంబర్ 11న కీలక భేటీ
ఆటోమోటివ్, ఈవీ రంగాల్లోని అగ్రగామి కంపెనీలు, కీలక పరిశ్రమల ప్రతినిధులు, స్టాక్ హోల్డర్లతో కూడిన ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం నవంబర్ 11న జరగనుంది. సచివాలయంలోని మినిస్టర్స్ కాన్ఫరెన్స్ హాల్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో (ఆఫ్‌లైన్, ఆన్‌లైన్) ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో భాగస్వాములయ్యేందుకు ఇప్పటికే సుమారు 25కి పైగా దేశవిదేశీ కంపెనీల ప్రతినిధులు అంగీకరించినట్లు మంత్రి పొన్నం వెల్లడించారు.
కొత్త పెట్టుబడులు.. కంపెనీల విస్తరణపై ఫోకస్
ఈ సమావేశం ప్రధాన ఎజెండాగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను పరిశ్రమల ప్రతినిధులకు వివరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులు, కొత్త పెట్టుబడి ప్రతిపాదనలు, ఉన్న కంపెనీల విస్తరణ ప్రణాళికలతో పాటు భవిష్యత్తులో ఆటోమోటివ్, ఈవీ రంగాలకు ఉన్న డిమాండ్‌పై లోతుగా చర్చించనున్నారు. ముఖ్యంగా పరిశ్రమల అవసరాలు, పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం నుంచి కావాల్సిన మౌలిక సదుపాయాలు, పాలసీ పరమైన ప్రోత్సాహకాలపై వారి నుంచే నేరుగా అభిప్రాయాలు సేకరించనున్నారు.
సమ్మిట్‌లో ప్రత్యేక వేదికలు.. పరిశ్రమల సలహాలకు పెద్దపీట
2026లో జరగబోయే ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌’తో పాటే నిర్వహించనున్న ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పోలో ప్రముఖ ఈవీ, ఆటోమోటివ్ కంపెనీలు చురుగ్గా పాల్గొనేలా చూడటం ఈ కౌన్సిల్ ముందున్న మరో ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులను ఆకర్షించి రాష్ట్రంలో మెగా ఇండస్ట్రీల ఏర్పాటుకు మార్గం సుగమం చేయనున్నారు. అలాగే ఈ సమ్మిట్‌లో ఆటోమోటివ్, ఈవీ రంగాలపై ప్రత్యేక చర్చా వేదికలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ చర్చించాల్సిన ప్రధాన అంశాలు, పరిశ్రమల ప్రాధాన్యతలను రాబోయే కౌన్సిల్ సమావేశంలో ఖరారు చేస్తారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన ప్రభుత్వ విధానాలు, ప్రస్తుతం కంపెనీలు ఎదుర్కొంటున్న సాధకబాధకాలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోవాలో ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.
ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ లాజిస్టిక్స్ డైరెక్టర్ ఔజాద్ షేక్ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ స్థాయి పెట్టుబడులను తెలంగాణకు ఆకర్షించడమే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పరిశ్రమల ప్రతినిధుల సలహాలు, సూచనలతో ఈవీ, ఆటోమోటివ్ రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించనున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు.