- ఆరు నెలల మెగా యాక్షన్ ప్లాన్!
- జనవరి నుంచి జూన్ వరకు పల్లెల్లో ప్రత్యేక మిషన్.
- చెరువుల పునరుద్ధరణ ఉపాధి కల్పనపైనే దృష్టి
- క్షేత్రస్థాయిలో 355 రకాల పనుల గుర్తింపు.
- నిధుల కొరత లేదన్న మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, మహా.
రానున్న వేసవిలో ఎల్‌నినో ప్రభావంతో పొంచి ఉన్న కరవు ఛాయలను, నీటి ఎద్దడి సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. విపత్తును ఒక అవకాశంగా మలుచుకుని, రాష్ట్రవ్యాప్తంగా జల వనరులను సమగ్రంగా సంరక్షించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ఒక బృహత్తర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది జనవరి నుంచి జూన్ వరకు పూర్తిస్థాయిలో ఆరు నెలల పాటు రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని భాగస్వామ్యం చేస్తూ ఒక ప్రత్యేక మిషన్‌ను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని నిర్ణయించింది. ప్రధానంగా పల్లెల్లోని చెరువులు, కుంటలు, వాగులు, కాలువల పునరుద్ధరణతో పాటు అడుగంటుతున్న భూగర్భ జలాలను పెంచడమే ఈ ఆరు నెలల మెగా ప్లాన్ ప్రథమ లక్ష్యం. సచివాలయంలో గురువారం నీటిపారుదల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర సాగునీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ మహా జల యజ్ఞానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాల మేరకు ఈ మూడు శాఖలు సంయుక్తంగా ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. వచ్చే వర్షాకాలం ప్రారంభానికి ముందే రాష్ట్రంలోని జల వనరులన్నింటినీ బలోపేతం చేయాలని అధికారులకు అత్యంత స్పష్టంగా నిర్దేశించారు.
గ్రామాల్లో జల సిరులు.. 355 రకాల పనుల గుర్తింపు
క్షేత్రస్థాయిలో నీటి నిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు ఈ ప్రత్యేక మిషన్‌లో భాగంగా ఇప్పటికే 355 రకాల పనులతో కూడిన ఒక సమగ్ర జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. కేవలం ఐదు నుంచి ఆరు నెలల స్వల్ప వ్యవధిలో గ్రామస్థాయిలో చేపట్టగల సాధ్యసాధ్యాలను బేరీజు వేసుకుని పకడ్బందీగా ఈ పనులను ఖరారు చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూనే, అవసరమైన చోట రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులను జోడించనుంది. ప్రస్తుతం ఉపాధి హామీలో అమల్లో ఉన్న 60:40 నిధుల వాటా విధానానికి తోడుగా, ఈ పనుల అమలుకు ఎంత మేర నిధులు అవసరమైనా వెనకాడేది లేదని, అదనపు నిధులను సమకూర్చేందుకు సర్కారు సన్నద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ప్రాథమికంగా చిన్న నీటిపారుదల చెరువులు, గ్రామ కుంటల్లో పూడిక తీయడం, పంట కాలువలు, ఫీడర్ ఛానళ్ల పునరుద్ధరణ, దెబ్బతిన్న తూముల మరమ్మతులు, కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, పొదలు, కలుపు మొక్కల తొలగింపుతో పాటు చెరువు కట్టల పటిష్ఠీకరణ పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి శాఖల సంపూర్ణ సమన్వయంతో చివరి ఆయకట్టు రైతుల పొలాల వరకూ సాగునీరు చేరేలా ఫీల్డ్ ఛానళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. దీనివల్ల ప్రస్తుతం ఉన్న సాగునీటి వ్యవస్థల పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడమే కాకుండా, రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పాదకతను భారీగా పెంచే అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
రాజస్థాన్, మహారాష్ట్ర మోడల్స్ తరహాలో రీఛార్జ్
చిన్న నదులు, వాగులు, స్థానిక నీటి ప్రవాహ మార్గాలపై ఎక్కడికక్కడ చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. వృథాగా పోతున్న వర్షపు నీటిని అడ్డుకుని నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలాల రీఛార్జ్‌కు తోడ్పడటం, తద్వారా స్థానికంగా నీటి లభ్యతను పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులను జయించి, విజయవంతమైన భూగర్భ జలాల పెంపు కార్యక్రమాలను అమలు చేసిన రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల నమూనాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆయా రాష్ట్రాల్లో అనుసరించిన అత్యుత్తమ పద్ధతుల్లో తెలంగాణ భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు అనువైన వాటిని గుర్తించి తక్షణమే క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు. ఈ అంశంపై అతి త్వరలోనే జిల్లా స్థాయి భూగర్భ జలాల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు అవసరాలపై లోతుగా సమీక్షించనున్నారు.
ఈ భారీ జల సంరక్షణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యాన్ని, సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఈ మిషన్‌కు ఒక ఆకర్షణీయమైన, స్పూర్తిదాయకమైన పేరును సూచించాలని మంత్రి అధికారులను కోరారు. నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖలన్నీ ఒకే తాటిపైకి వచ్చి సమర్థవంతంగా పనిచేయాలని ఆయన ఉద్బోధించారు. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, నీటిపారుదల శాఖ ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్, పంచాయతీరాజ్ కమిషనర్ డి. దివ్యతో పాటు నీటిపారుదల శాఖ ఈఎన్సీ ఓ.వి. రమేష్‌బాబు, మిషన్ భగీరథ ఈఎన్సీ జి. కృపాకర్‌రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొని రాబోయే ఆరు నెలల కార్యాచరణకు తుదిరూపునిచ్చారు.








