Mahaa Daily Exclusive

  ప్రెస్‌మీట్‌ పెడితే అరెస్టు చేస్తారా?

Share

  • తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన సాగిస్తున్నారా?
  • ప్రశ్నిస్తే కేసులా.. విమర్శిస్తే అరెస్టులా? – దేవీప్రసాద్

హైదరాబాద్‌, మహా : బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కాంగ్రెస్‌ నేతలు చేసిన ఆరోపణలను వాస్తవాలతో తిప్పికొడుతూ ప్రజలకు నిజానిజాలు తెలియజేసేందుకు ప్రెస్‌మీట్‌ నిర్వహించడం నేరమా? అని మాజీ టీఎన్జీవో అధ్యక్షుడు, బెవరేజ్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ దేవీప్రసాద్‌ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం తన బాధ్యతను నిర్వర్తించినందుకు దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ప్రశ్నిస్తే కేసులు.. విమర్శిస్తే అరెస్టులా? ఇదేనా కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పిన ప్రజాపాలన? అని నిలదీశారు. రాజకీయ ఆరోపణలకు రాజకీయంగానే సమాధానం చెప్పాలని, పోలీసు వ్యవస్థను ఉపయోగించి ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కాలని చూడటం ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేయడమేనని పేర్కొన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే ఇలాంటి చర్యలు ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నాయని విమర్శించారు. బాలరాజు యాదవ్‌పై నమోదు చేసిన కేసులు, ఎఫ్‌ఐఆర్‌ వివరాలను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పలేక ప్రశ్నించే నాయకులను అరెస్టు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు.

అరెస్టులతో బీఆర్ఎస్‌ నాయకులను భయపెట్టలేరని, ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అణచివేయలేరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ప్రెస్‌మీట్‌ పెట్టడం నేరం కాదని, వాస్తవాలు వెల్లడించడం తప్పు కాదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని దేవీప్రసాద్‌ పేర్కొన్నారు.