Mahaa Daily Exclusive

  అనావృష్టి కాదు.. ముమ్మాటికీ ‘రేవంత్‌ వృష్టి’యే!

Share

  •  ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎండిన పొలాలు.. రైతులకు పరిహారం ఏది?
  •  క్షేత్రస్థాయిలో పంటల పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్‌రావు

మెదక్,మహా.

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చినవి కావని, ఇది ముమ్మాటికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యంతో సృష్టించిన ‘రేవంత్‌ వృష్టి’యేనని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత టి. హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని చిలిపిచెడ్‌, హత్నూర మండలాల్లో కరెంటు కోతలు, సాగునీటి కొరతతో నిలువునా ఎండిపోయిన వరి పొలాలను ఆయన శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్‌లతో కలిసి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నదుల్లో పుష్కలంగా నీళ్లున్నా సకాలంలో మోటార్లు ఆన్‌ చేయకుండా రైతుల పొలాలను ఎండబెట్టిన ఘనత ఈ అసమర్థ ప్రభుత్వానిదేనని హరీశ్‌రావు మండిపడ్డారు. దేవాదుల ప్రాజెక్టులో 60 టీఎంసీలు ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ, కేవలం 18 టీఎంసీలే ఎత్తి.. మిగతా గోదావరి నీళ్లను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్టిసీమకు తరలించుకుపోయేలా కిందకు వదిలేశారని ఆరోపించారు. కృష్ణా నదిలో నిండుగా నీళ్లున్నా కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లను పూర్తిస్థాయిలో నడపకుండా పాలమూరు రైతుల కడుపుకొట్టి, ఆ నీటితో కుప్పంలో పంటలు పండేలా చేశారని విమర్శించారు. దేవాదులలో మోటార్లు ఎన్ని రోజులు, ఎన్ని గంటలు నడిపారో దమ్ముంటే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ప్రభుత్వమే అఖిలపక్ష సమావేశంలో అంగీకరించిందని, కానీ నిన్నటి కేబినెట్‌ భేటీలో కనీసం ఆ రైతులను ఆదుకునే అంశంపై ఒక్క ముక్క కూడా చర్చించకపోవడం దారుణమన్నారు.

గ్లోబల్ సమ్మిట్‌లు, మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీల కోసం లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు, ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లలో తిరిగేందుకు డబ్బులుంటాయి గానీ.. పెట్టుబడి కోల్పోయి అల్లాడుతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి పైసలు లేవా అని ఆయన నిలదీశారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో తక్షణమే ఎకరానికి రూ.5,000 చొప్పున కరువు సాయం అందించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో రూ.1600 కోట్లు కేటాయించామని అసెంబ్లీలో గొప్పలు చెప్పుకున్న పంటల బీమాను అమలు చేయకపోవడం వల్ల నేడు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గత ప్రభుత్వం అండగా నిలిచిన రైతుబీమాను ఆపేసిన కాంగ్రెస్ సర్కారు, ఇందిరమ్మ బీమా పేరుతో మళ్లీ దరఖాస్తులంటూ పండుగ పూట రైతుల చెవిన చావుకబురు చెప్పిందని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీని అబద్ధాల అడ్డాగా మార్చేశారని హరీశ్‌రావు దుయ్యబట్టారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయన్నారు. తాజాగా రైతుబంధు డబ్బులు పడ్డాయంటూ సీఎం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయని, ఆశగా బ్యాంకుల చుట్టూ తిరిగి రైతులు వెనుదిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ముంటే ఆ ఫేక్ మెసేజ్‌లు పంపుతున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. మరోవైపు, కోతలు ప్రారంభమై కళ్లాల్లోకి 30 శాతం ధాన్యం వచ్చినా ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వెనుక సన్నాలకు బోనస్ ఎగ్గొట్టే కుట్ర దాగి ఉందన్నారు. రుణమాఫీ కాక అరిగోస పడుతున్న రైతుల బ్యాంకు ఖాతాల్లో పడిన వృద్ధాప్య పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, ధాన్యం డబ్బులను సైతం బ్యాంకర్లు పాత బాకీల కింద జమ చేసుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లా జీవనాధారమైన సింగూరు ప్రాజెక్టును మరమ్మతుల పేరుతో ప్రభుత్వం పూర్తిగా ఖాళీ చేసిందని, 20 టీఎంసీల నీటిని వృథా చేసి నాలుగు జిల్లాల ప్రజల గొంతు ఎండబెట్టిందని హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రజలకు తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేని సర్కారు.. బహుళజాతి బీరు ఫ్యాక్టరీలకు మాత్రం యథేచ్ఛగా లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తూ వికృత క్రీడ ఆడుతోందని ధ్వజమెత్తారు. వానాకాలంలోనే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి తెచ్చిన ఈ ప్రభుత్వానికి, భవిష్యత్తులో ప్రజలే శాశ్వత సెలవు ప్రకటించడం ఖాయమని ఆయన హెచ్చరించారు. తక్షణమే పెండింగ్ రుణమాఫీ పూర్తి చేయాలని, ఉపాధి హామీ దినాలు పెంచాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి సన్నాలకు బోనస్ చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.