- తూకాల్లో మాయాజాలంపై కొరడా!
- రేషన్ బియ్యం దారిమళ్లిస్తే పీడీ యాక్ట్ తప్పదు.
- వారం రోజుల్లోనే 2,686 తనిఖీలు.. 370 కేసులు.
హైదరాబాద్, మహా.
సామాన్యుడి కంచంలోకి చేరే బియ్యంపై నిలువుదోపిడీకి పాల్పడుతున్న అక్రమ వ్యాపారుల ఆట కట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి, ఇష్టారాజ్యంగా ధరలు పెంచడంతో పాటు తూకాల్లోనూ భారీ మోసాలకు పాల్పడుతున్న బియ్యం మాఫియాపై పౌరసరఫరాలు, విజిలెన్స్, న్యాయ తూనికల కొలతలు, జీఎస్టీ, పోలీసు విభాగాలు సంయుక్తంగా కొరడా ఝుళిపిస్తున్నాయి. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 5 వరకు కేవలం వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 2,686 ఆకస్మిక తనిఖీలు చేపట్టి, 370 కేసులు నమోదు చేయడం ఈ దందా తీవ్రతకు అద్దం పడుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ బృందాలు 1,141 తనిఖీలు నిర్వహించి 55 కేసులు, 35 క్రిమినల్ కేసులు నమోదు చేయగా.. న్యాయ తూనికల కొలతల శాఖ 1,545 తనిఖీలతో 280 కేసులు నమోదు చేసి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
అధికారుల విస్తృత తనిఖీల్లో వెలుగుచూస్తున్న మోసాలు వినియోగదారులను ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. నిస్సిగ్గుగా 25 కిలోల బియ్యం బస్తాలపై 26 కిలోలుగా తప్పుడు లేబుళ్లు వేసి విక్రయిస్తుండటాన్ని అధికారులు రట్టు చేశారు. అంతేకాకుండా, తయారీదారులు బస్తాలపై ముద్రించిన అసలు ధర కనిపించకుండా, దానిపై అధిక ధరల స్టిక్కర్లు అతికించి వినియోగదారులను నిలువునా దోచుకుంటున్నట్లు గుర్తించారు. చాలా వ్యాపార సంస్థలు కనీస ట్రేడ్ లైసెన్సులు, జీఎస్టీ నమోదు, కార్మిక, ఆహార భద్రత అనుమతులు లేకుండానే గుట్టుచప్పుడు కాకుండా దందా సాగిస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో దాడులు ముమ్మరం చేసిన అధికారులు.. సరూర్‌నగర్, జీడిమెట్ల, అల్వాల్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఏకంగా 11 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. దీనికి తోడు నిరుపేదలకు పంపిణీ చేసే ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్) బియ్యాన్ని సైతం అక్రమంగా కొనుగోలు చేసి, వాటికి పాలిష్ పట్టి దొంగచాటుగా బ్రాండెడ్ బస్తాల్లో నింపి విక్రయిస్తున్నట్లు దాడుల్లో బట్టబయలైంది. ఈ అక్రమ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నట్లు గుర్తించిన విభాగాలు ఆ దిశగా లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.
వినియోగదారులపై ధరల భారాన్ని తగ్గించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ప్రధాన బియ్యం రకాలకు గరిష్ఠ విక్రయ ధరలను నిర్దేశించింది. తెలంగాణ బీపీటీ, కేఎన్‌ఎం రకాల గరిష్ఠ ధరను కిలోకు రూ.66 గా, ఆర్‌ఎన్‌ఆర్ లేదా తెలంగాణ సోనా కిలో రూ.74 గా, హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్ రకాలను కిలో రూ.79 గా ఖరారు చేసింది. వ్యాపారులు ఈ ధరలను దుకాణాల వద్ద వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా బోర్డులపై ప్రదర్శించాలని, 26 కిలోల ప్యాకేజీలపై బరువు, ధరల వివరాలు కచ్చితంగా ముద్రించాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది. రేషన్ బియ్యం అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, పదేపదే నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే వ్యాపారులపై నిత్యావసర వస్తువుల చట్టం, భారతీయ న్యాయ సంహిత, న్యాయ తూనికల కొలతల చట్టం కింద కేసులు నమోదు చేయడంతో పాటు, అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నిరంతర తనిఖీలతో పకడ్బందీగా అమలైతేనే సామాన్యులకు బియ్యం మంట నుంచి నిజమైన ఉపశమనం లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.








