Mahaa Daily Exclusive

  బ్యాంకుల సేవలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి… వరంగల్ డీసీపీ వేముల శ్రీనివాస్

Share

 

వరంగల్, మహా ;

ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వరంగల్ డీసీపీ వేముల శ్రీనివాస్, యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ గంటి కమలాకర్ లు పిలుపునిచ్చారు. బుధవారం వరంగల్ సెంట్రల్ కాంప్లెక్స్‌లో యూనియన్ బ్యాంక్ ఆవిర్భవించి 108 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ మాదిరగాని ప్రశాంత్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో డీసీపీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, బ్యాంక్ రీజినల్ హెడ్ గంటి కమలాకర్, రీజినల్ అస్యూరెన్స్ హెడ్ సర్వేష్, చీఫ్ మేనేజర్ చంద్రశేఖర్ లు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ గంటి కమలాకర్ మాట్లాడుతూ, బ్యాంకు ఎల్లవేళలా వినియోగదారుల సేవలకు, వారి ఆర్థిక అవసరాలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. వినియోగదారులు కూడా బ్యాంకులు అందించే వివిధ రకాల పొదుపు పథకాలు, డిజిటల్ సేవలు మరియు రుణ సదుపాయాలను సంపూర్ణంగా వినియోగించుకుని ఆర్థికంగా స్థిరపడాలని ఆయన కోరారు. యూనియన్ బ్యాంక్ ప్రజలకు నిరంతరం నాణ్యమైన, వేగవంతమైన సేవలను అందిస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటోందని హర్షం వ్యక్తం చేశారు.

డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, బ్యాంకులు సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరికీ ఆర్థికంగా రుణాలు అందిస్తూ అండగా నిలుస్తున్నాయని, దీనివల్ల ప్రజలు తమ అవసరాలను సకాలంలో తీర్చుకుంటున్నారని కొనియాడారు. గతంలో ఇళ్లు నిర్మించాలన్నా పూర్తిగా సొంత డబ్బు ఉంటేనే సాధ్యమయ్యేదని, కానీ ఇప్పుడు బ్యాంకుల సహకారంతో ఆ పరిస్థితి మారిందన్నారు. అవసరమైన అర్హతలు ఉంటే బ్యాంకులు ముందుకొచ్చి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తూ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నాయని తెలిపారు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం, విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి బ్యాంకులు అందిస్తున్న విద్యా రుణాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, తద్వారా వారు దేశ పురోగతికి భాగస్వాములు అవుతున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉన్నతాధికారులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో వినియోగదారులు పాల్గొన్నారు.