- ఢిల్లీ మాజీ సీఎంకు బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్
- రూ.7 కోట్లు ఇవ్వకుంటే కేజ్రీవాల్‌ను చంపేస్తామని హెచ్చరిక
- ఢిల్లీ పోలీసులకు ఆప్ ఎమ్మెల్యే ఫిర్యాదు
న్యూఢిల్లీ, మహా : ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. రూ. 7 కోట్లు ఇవ్వాలని లేకుంటే కేజ్రీవాల్‌ను ఆయన కుమార్తెను చంపేస్తామని బెదిరించారు. అయితే, ఆ ఘటనకు పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అని పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు. దిల్లీలోని తిలక్ నగర్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తు చేపట్టారు. లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడినంటూ ఇటీవల తనకు ఓ వ్యక్తి ఫోన్ చేశారని జర్నైల్ సింగ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ కాల్ అనంతరం వాట్సప్ సందేశాలు కూడా పంపినట్లు ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే ఫిర్యాదు ప్రకారం,
“నేను లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి మాట్లాడుతున్నా. రూ. 7 కోట్లు ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్‌కు చెప్పు. లేదంటే కేజ్రీవాల్‌ను, ఆయన కుమార్తె హర్షిత కేజ్రీవాల్‌ను చంపేస్తా” అని నిందితుడు బెదిరించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మరోవైపు, అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రముఖ వ్యక్తి కావడంతో, ఈ బెదిరింపు జాతీయ, ప్రజా భద్రతకు ముప్పుగా మారిందని జర్నైల్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగకముందే నిందితుడిని పట్టుకోవాలని పోలీసులను కోరారు. ఇందుకోసం కాల్ డీటెయిల్ రికార్డులు, ఐపీ లాగ్‌లు, లొకేషన్ గుర్తించి సమగ్ర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, కేజ్రీవాల్‌కు పూర్తి రక్షణ కల్పించేందుకు భద్రతా విభాగాలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు, మొహాలీ పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లు (దోపిడీ/వసూలు చేయడం, భయపెట్టడం, ఐటీ చట్టం) వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.







