- టేకాఫ్ సమయంలో అదుపుతప్పి
- షోలాపూర్ విమానాశ్రయంలో శిక్షణా విమానం ప్రమాదం
- మహిళా ట్రైనీ పైలట్‌కు తప్పిన ప్రమాదం
- సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
షోలాపూర్, మహా : మహారాష్ట్రలోని షోలాపూర్ విమానాశ్రయంలో శిక్షణా విమానం ప్రమాదానికి గురైంది. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టేకాఫ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం అదుపుతప్పి రన్‌వేపై నుంచి పక్కకు జారిపోయింది. దీంతో విమానం ముందు భాగం నేలకు వంగిపోయింది. శిక్షణలో భాగంగా విమానం టేకాఫ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రన్‌వేపై వేగంగా కదులుతున్న విమానం ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. దీంతో విమానం ముందు భాగం నేలకు వంగిపోయింది. ఈ ఘటనతో విమానాశ్రయ పరిసరాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ శిక్షణా విమానాన్ని ఓ మహిళా ట్రైనీ పైలట్ నడుపుతున్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగినప్పటికీ ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. సురక్షితంగా విమానం నుంచి బయటపడటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. విమానంలో మరెవరైనా ఉన్నారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జిల్లా పరిపాలన అధికారులు షోలాపూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు. విమానం రన్‌వేపై నుంచి పక్కకు వెళ్లిపోవడానికి గల కారణాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు ఘటనపై మరింత సమాచారం సేకరిస్తున్నారు.







