- కేరళంలో షిగెల్లా ఇన్ ఫెక్షన్ కలకలం
- 75 కేసులు.. మూడు ప్రాంతాల్లో అలర్ట్
- ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు
తిరువనంతపురం, మహా : కేరళంలో మరోసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ షిగెల్లా ఆందోళన కలిగిస్తోంది. మలప్పురం జిల్లాలో మూడు ప్రాంతాల్లో కొత్త కేసులు గుర్తించడంతో వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అరీకోడ్, పుల్పట్ట, ఎడవన్న ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్లు నిర్ధారణ కావడంతో అధికారులు ఆ ప్రాంతాల్లో నిఘాను పెంచారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో సుమారుగా 75 షిగెల్లా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వి. వినోద్ వెల్లడించారు. వీటిలో ఎనిమిది కేసులు ఇప్పటికే ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులతో సంబంధం ఉన్నవారిలో గుర్తించినట్లు తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా స్థాయి రాపిడ్ రెస్పాన్స్ టీమ్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆహార తయారీ కేంద్రాల్లో తనిఖీలు, తాగునీటి వనరుల పరిశీలనతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో సామూహిక విందులపై ఆంక్షలు విధించారు. ప్రజలు ఆహారం, నీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
షిగెల్లా ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
షిగెల్లా అనేది పేగులకు ఇన్ఫెక్షన్ కలిగించే ఒక రకమైన బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధిని వైద్య పరిభాషలో షిగెల్లోసిస్ అంటారు. ఇది ప్రధానంగా పెద్ద పేగుపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా తీవ్రమైన విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ ఇన్ఫెక్షన్ ఎవరికైనా సోకవచ్చు. అయితే ఐదేళ్లలోపు పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో సమస్యలు తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పరిశుభ్రత సరిగా లేని ప్రాంతాలు, కలుషిత నీటి సరఫరా ఉన్న ప్రాంతాల్లో ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. షిగెల్లా బ్యాక్టీరియా సోకిన వ్యక్తి మలంలో బయటకు వస్తుంది. ఆ తర్వాత కలుషితమైన చేతులు, నీరు, ఆహారం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. చాలా తక్కువ సంఖ్యలో బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించినా ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం దీనికి ఉండటం ఆందోళన కలిగించే విషయం.
కలుషిత నీరు, ఆహారంతోనే ఎక్కువ ముప్పు
షిగెల్లా ఇన్ఫెక్షన్ వ్యాప్తికి ప్రధాన కారణం పరిశుభ్రత లోపం. ముఖ్యంగా తాగునీరు, ఆహారం కలుషితం కావడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించవచ్చు. మలంతో కలుషితమైన నీటిని తాగడం వల్ల బ్యాక్టీరియా నేరుగా జీర్ణవ్యవస్థలోకి చేరుతుంది. నీటి సరఫరా వ్యవస్థలో పరిశుభ్రత లోపించినప్పుడు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఉడికించని ఆహారం, అపరిశుభ్రమైన పరిస్థితుల్లో తయారుచేసిన పదార్థాలు, ఎక్కువసేపు బయట ఉంచిన ఆహారం ద్వారా ఇన్ఫెక్షన్ సోకవచ్చు. మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోకుండా వంట చేయడం లేదా ఆహారం తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా ఇతరులకు చేరుతుంది. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి మలంతో కలుషితమైన వస్తువులు, ఉపరితలాలను తాకిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోకుండా ఇతరులు వాటిని తాకడం వల్ల కూడా వ్యాధి వ్యాపించవచ్చు. ఈగలు, ఇతర కీటకాల ద్వారా కలుషిత పదార్థాల నుంచి ఆహారంపై బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. అందుకే ఆహారాన్ని ఎప్పుడూ మూతపెట్టి ఉంచాలి.
షిగెల్లా బ్యాక్టీరియా సోకిన తరువాత సాధారణంగా ఒకటి నుంచి రెండు రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. మరికొంత మందిలో ఆలస్యంగా కూడా బయటపడవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ సోకినవారిలో కనిపించే ప్రధాన లక్షణాలు..
తరచూ విరేచనాలు కావడం.
మలంలో రక్తం లేదా చీము కనిపించడం.
తీవ్రమైన కడుపునొప్పి, పొత్తికడుపులో మెలికలు తిరగడం.
జ్వరం రావడం.
వికారం, వాంతులు.
ఆకలి తగ్గడం, నీరసం.
శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ ఏర్పడటం.
ముఖ్యంగా మలంలో రక్తం కనిపించడం, తీవ్రమైన విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలను సాధారణ సమస్యలుగా భావించకూడదు. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
లక్షణాలు లేకపోయినా
షిగెల్లా ఇన్ఫెక్షన్లో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కొంతమందిలో వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా వారి మలం ద్వారా బ్యాక్టీరియా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ పరిస్థితిని గుర్తించడం కష్టంగా ఉండవచ్చు. పిల్లలు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే ఇంట్లోని ఇతరులకు కూడా ఇన్ఫెక్షన్ వ్యాపించవచ్చు. అందువల్ల పిల్లల వ్యక్తిగత పరిశుభ్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇన్ఫెక్షన్ ఉన్నవారు ఇతరుల కోసం ఆహారం తయారు చేయకుండా వైద్యుల సూచనలు పాటించడం మంచిది.
చికిత్సలో నిర్లక్ష్యం చేస్తే
తగిన సమయంలో చికిత్స అందకపోతే కిడ్నిలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపించవచ్చు. అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉంది. మలప్పురం జిల్లాలోని మూడు ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్లు బయటపడటంతో అధికారులు నివారణ చర్యలను వేగవంతం చేశారు. జిల్లా స్థాయి రాపిడ్ రెస్పాన్స్ టీమ్ సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. వ్యాధి వ్యాప్తికి గల కారణాలను గుర్తించడంతో పాటు మరిన్ని కేసులు నమోదు కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. ఆరోగ్య శాఖ, స్థానిక స్వపరిపాలన శాఖ, ఆహార భద్రతా విభాగాలు కలిసి ఆహార తయారీ, నిల్వ, పంపిణీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టనున్నాయి. హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాల్లో పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించనున్నారు. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లో సామూహిక విందులపై కూడా ఆంక్షలు విధించారు. తాగునీటి వనరులను పరిశీలించడం, అవసరమైన చోట క్లోరినేషన్ చేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి చర్యలను చేపడుతున్నారు.







