- 43 కేంద్రాల్లో కార్యకలాపాలు!
- రూ.50 వేల ఆశ చూపి మహిళలే లక్ష్యంగా దందా.
- హాస్టళ్లలోనే హార్మోన్ ఇంజెక్షన్లు
హైదరాబాద్, మహా:
సంతానలేమి చికిత్స పేరుతో నిర్వహిస్తున్న ఫెర్టిలిటీ కేంద్రాల్లో అండాల అక్రమ సేకరణ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ల అక్రమ కార్యకలాపాలకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ నివేదికలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అండాలను సేకరించేందుకు బ్రోకర్ల ముఠా పనిచేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఒక్క చోట మాత్రమే అనుమతి తీసుకుని ఓయాసిస్, సద్గురు సంస్థలు కలిపి 43 కేంద్రాల్లో కార్యకలాపాలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో వైద్యులు, బ్రోకర్లు, ఫెర్టిలిటీ కేంద్రాల నిర్వాహకుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇతర రాష్ట్రాల నుంచి మహిళల తరలింపు
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని బ్రోకర్ల ముఠా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. ఒక్కో అండం దానం ప్రక్రియకు రూ.50 వేల వరకు ఇస్తామని ఆశ చూపినట్లు పోలీసులు ఆరోపించారు. నగరానికి తీసుకొచ్చిన మహిళలకు బేగంపేటలోని అమీ నీతా గర్ల్స్ హాస్టల్లో వసతి కల్పించి, అక్కడి నుంచి ఫెర్టిలిటీ కేంద్రాలకు తరలించినట్లు గుర్తించారు. ఒక్కో డోనర్‌కు సంబంధించి బ్రోకర్లకు రూ.65 వేల వరకు చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
వైద్యుల పర్యవేక్షణ లేకుండానే ఇంజెక్షన్లు?
అండాల ఉత్పత్తిని పెంచేందుకు మహిళలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండానే హాస్టల్లో ఈ ఇంజెక్షన్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. హాస్టల్లో హ్యూమాగ్ హెచ్‌పీ 150 ఐయూ ఇంజెక్షన్లతో పాటు ఉపయోగించిన మందుల సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైద్య వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు కూడా ఉల్లంఘించినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ పరిణామాలు మహిళల ఆరోగ్య భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
అండాల సంఖ్య ఆధారంగా బ్రోకర్లకు చెల్లింపులు
ఈ వ్యవహారంలో బ్రోకర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా రిమాండ్ నివేదికలో ప్రస్తావించారు. ఒక్కో డోనర్ నుంచి ఏడు కంటే తక్కువ అండాలు లభిస్తే బ్రోకర్లకు చెల్లించే మొత్తంలో కోత విధించేలా నిబంధనలు పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. అండాల నాణ్యత ఆధారంగా కూడా చెల్లింపులు తగ్గించేలా ఒప్పందాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రక్రియ ఆరో రోజు కంటే ముందే నిలిచిపోతే ఎలాంటి చెల్లింపులు చేయకూడదనే నిబంధన కూడా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
66 కేసుల్లో 19 మంది డోనర్ల వివరాలు గల్లంతు?
జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 66 డోనర్ కేసులు జరిగినట్లు కేంద్రాల రికార్డుల్లో నమోదైంది. అయితే అధికారులకు మాత్రం 47 మంది డోనర్ల వివరాలనే సమర్పించినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన 19 మంది డోనర్ల వివరాలు, వాటికి సంబంధించిన రికార్డులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యత్యాసానికి కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పలు ప్రాంతాలకు అండాల సరఫరా
బంజారాహిల్స్, దిల్సుఖ్నగర్ కేంద్రాల్లో అండాల సేకరణ ప్రక్రియ జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సేకరించిన అండాలను ఐవీఎఫ్ చికిత్సల కోసం గచ్చిబౌలి, ఉప్పల్, టోలిచౌకి, మలక్‌పేట ప్రాంతాల్లోని కేంద్రాలకు సరఫరా చేసినట్లు గుర్తించారు. ఆయా కేంద్రాల అనుమతులు, కార్యకలాపాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో డోనర్ బుక్, విజిటర్ బుక్, శాంపిల్స్ ట్యాంక్ బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఎండీ పరారీ.. ఇద్దరి అరెస్టు
ఓయాసిస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దుర్గారావు పరారీలో ఉన్నట్లు రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. బ్రోకర్లు అమిత్ శర్మ, నిఖత్ పర్వీన్‌తో పాటు పలువురు నిందితులు కూడా పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. మలక్‌పేట బ్రాంచ్ ఇన్చార్జ్ ఆనంద్‌రాజ్, అడ్మినిస్ట్రేటర్ సుభానీ షేక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని న్యాయస్థానాన్ని కోరారు.
బీఎన్ఎస్, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. మహిళల నుంచి అండాల సేకరణలో నిబంధనల ఉల్లంఘన, బ్రోకర్ల నెట్వర్క్, కేంద్రాల నిర్వహణ, వైద్యుల పాత్ర తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రిమాండ్ నివేదికలో వెల్లడైన ఆరోపణలు నిరూపితమైతే మహిళల ఆరోగ్య భద్రతతో పాటు సంతానోత్పత్తి చికిత్సా కేంద్రాల నియంత్రణ వ్యవస్థలోని లోపాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.








