Mahaa Daily Exclusive

  మైనస్‌ డిగ్రీల్లో కశ్మీర్‌.. గడ్డకట్టిస్తున్న చలి.

Share

• శ్రీనగర్‌లో ఈ సీజన్‌లోనే అత్యల్ప రాత్రి ఉష్ణోగ్రత నమోదు.

శ్రీనగర్‌, మహా:

జమ్మూకశ్మీర్‌ను చలి పులి వణికిస్తోంది. లోయలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. వేసవి రాజధాని శ్రీనగర్‌లో ఈ సీజన్‌లోనే అత్యల్ప రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం రాత్రి 0.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత రికార్డయింది. పర్యాటక ప్రాంతాలైన గుల్మార్గ్‌, పహల్గాంలోనూ చలి తీవ్రత పెరిగింది. అనంత్‌నాగ్‌ జిల్లాలోని పహల్గాంలో మైనస్‌ 2.8 డిగ్రీలు, బారాముల్లాలో మైనస్‌ 1.0 డిగ్రీ, కశ్మీర్‌ ప్రవేశ ద్వారంగా పిలిచే ఖాజీగుండ్‌లో మైనస్‌ 0.8 డిగ్రీలు నమోదయ్యాయి. కుప్వారాలో మైనస్‌ 1.3 డిగ్రీలు, కోకర్‌నాగ్‌లో 1.0 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

జమ్మూ ప్రాంతంలోనూ చలి ప్రభావం

గురువారం కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి ఎండ కనిపించినప్పటికీ చలి తీవ్రత తగ్గలేదు. అనేక చోట్ల మంచు కురిసింది. జమ్మూ ప్రాంతంలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. జమ్మూ నగరంలో 10.8 డిగ్రీలు, కట్రాలో 10.9 డిగ్రీలు, బటోట్‌లో 5.7 డిగ్రీలు, బనిహాల్‌లో 8.7 డిగ్రీలు, భదేర్వాలో 2.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నెలాఖరు వరకు పొడి వాతావరణం

ఈ నెలాఖరు వరకు కశ్మీర్‌ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. దీంతో లోయలో చలి తీవ్రత మరింత పెరగనుంది.