Mahaa Daily Exclusive

  బంగారంలో ‘రీనియం’ విషం.

Share

బంగారంలో ‘రీనియం’ విషం.
* హాల్‌మార్క్‌ ఉన్నా భద్రత లేదా?
* బరువు పెంచి స్వచ్ఛతను తగ్గించే కొత్త తరహా మాయాజాలం.
* జోధ్‌పూర్‌ ప్రయోగంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు.
* 22 క్యారెట్ల ముద్ర ఉన్న నగలో 19.6 క్యారెట్ల బంగారమే!
* ఎక్స్‌ఆర్‌ఎఫ్‌ యంత్రాల పరిమితులపై బీఐఎస్‌ అధికారిక పత్రాల్లోనే కీలక హెచ్చరికలు.

న్యూఢిల్లీ, మహా.

భారతీయ కుటుంబాలకు బంగారం అంటే కేవలం ఒంటిపై మెరిసే ఆభరణం కాదు.. అది తరతరాలుగా కూడబెట్టుకున్న ఆస్తి, ఆపద వేళ ఆదుకునే ఆర్థిక కవచం, ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా. ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు తమ కష్టార్జితాన్ని పసిడిపై పెట్టుబడిగా పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. కానీ, అటువంటి నమ్మకమైన బంగారంలోనే అత్యంత భారీ లోహమైన ‘రీనియం’ కలిపి, బరువును కృత్రిమంగా పెంచి వినియోగదారులను నిలువునా ముంచే కొత్త తరహా మోసం వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహించిన ఒక సంచలనాత్మక పరిశోధనాత్మక ప్రయోగం ఇప్పుడు దేశ నగల మార్కెట్‌ను కుదిపేస్తోంది. 22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగా హాల్‌మార్క్‌ ముద్ర వేసిన ఆభరణంలో అసలు బంగారం వాటా కేవలం 81.73 శాతం మాత్రమేనని, మిగిలిన బరువులో రీనియం వంటి ఇతర లోహాలు ఉన్నాయని తెలిసింది. అంతకంటే ఆందోళనకరమైన విషయం ఏమిటంటే—నగల దుకాణాలు, పరీక్షా కేంద్రాల్లో వాడే అత్యాధునిక యంత్రాలు సైతం ఈ కల్తీని గుర్తించలేకపోయాయన్న ఆరోపణ! అయితే, ఇది ఒక నిర్దిష్ట ప్రయోగానికి సంబంధించిన అంశం మాత్రమేనని, దేశవ్యాప్తంగా ఇదే స్థాయిలో కల్తీ జరుగుతోందని నిర్ధారించే అధికారిక ఆధారాలు ఇంకా బయటకు రాలేదని గమనించాలి. అయినప్పటికీ, యంత్రాలే మోసపోతే సామాన్యుడి సొమ్ముకు రక్షణ ఎవరిది? అన్న ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

రోజుకు దాదాపు 2 టన్నుల పసిడి కొనుగోళ్లు.. చిన్న లోపమైనా పెను ప్రభావమే!

భారతదేశంలో బంగారం మార్కెట్‌ ఎంత భారీగా ఉంటుందో ప్రపంచ స్వర్ణ మండలి నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. 2025 వార్షిక నివేదిక ప్రకారం దేశంలో ఆభరణాలు, నాణేలు, కడ్డీల రూపంలో 710 టన్నులకు పైగా బంగారం డిమాండ్‌ నమోదైంది. అంటే భారతీయులు రోజుకు సగటున దాదాపు 2 టన్నుల పసిడిని కొనుగోలు చేస్తున్నారు. 2026లోనూ ధరలు భారీగా పెరిగినప్పటికీ రోజుకు సగటున 1.5 టన్నుల మేర కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఇంతటి మహా సముద్రం లాంటి మార్కెట్‌లో స్వచ్ఛత నిర్ధారణలో చిన్నపాటి సాంకేతిక లోపం తలెత్తినా, దాని ప్రభావం లక్షలాది కుటుంబాల ఆర్థిక పునాదులను కదిలిస్తుంది.

జోధ్‌పూర్‌ ప్రయోగం.. 22 క్యారెట్ల ముద్ర వెనుక దిగ్భ్రాంతికర నిజం!

జోధ్‌పూర్‌కు చెందిన ఒక నగల వ్యాపారి సహకారంతో పరిశోధకులు ఒక ప్రయోగాన్ని నిర్వహించారు. మొదట 7.83 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంలో 1 గ్రాము రీనియం పొడిని, ఆభరణం తయారీ కోసం మరో 0.75 గ్రాముల మిశ్రమ లోహాన్ని కలపడంతో తుది ఆభరణం బరువు 9.58 గ్రాములకు చేరింది.
ఈ ఆభరణాన్ని జోధ్‌పూర్‌లోని పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లగా, ఒక గుర్తింపు పొందిన హాల్‌మార్కింగ్‌ కేంద్రం దానికి ఏకంగా 22 క్యారెట్ల (916) హాల్‌మార్క్‌ గుర్తింపును జారీ చేసినట్లు నివేదిక పేర్కొంది. మరో దుకాణంలో అత్యాధునిక ఎక్స్‌రే ఫ్లోరోసెన్స్‌ యంత్రంతో పరీక్షించగా, అందులో 93.7 శాతం బంగారం ఉన్నట్లు యంత్రం చూపించిందే తప్ప రీనియం జాడను పసిగట్టలేకపోయింది. వాస్తవానికి ఆ నగలో ఉన్న అసలు బంగారం కేవలం 81.73 శాతం—అంటే 19.6 క్యారెట్లు మాత్రమే!

అసలు ఏమిటీ రీనియం? చైనా నెట్‌వర్క్‌ ప్రమేయం నిజమేనా?

రీనియం అనేది బంగారం కంటే ఎక్కువ సాంద్రత కలిగిన అత్యంత అరుదైన, భారీ లోహం. స్వచ్ఛమైన బంగారం సాంద్రత 19.3 గ్రాములు కాగా, రీనియం సాంద్రత 20.8 గ్రాములు ఉంటుంది. పారిశ్రామిక పరికరాలు, ఎక్స్‌రే యంత్రాల్లో వాడే ఈ లోహాన్ని పసిడిలో కరిగించడం వల్ల ఆభరణం పరిమాణం పెరగకపోయినా బరువు మాత్రం అమాంతం పెరుగుతుంది. గతంలో ఇండోర్‌ సరాఫా వ్యాపారులు సైతం రీనియంతో పాటు రుథేనియం, ఇరిడియం, ఓస్మియం వంటి భారీ లోహాల కల్తీపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ కల్తీ వెనుక చైనా సరఫరా గొలుసు ఉందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. చైనాలోని షెన్‌జెన్‌ నగరానికి చెందిన ఒక ఏజెంట్‌ సూచన మేరకు, ముంబైలోని మధ్యవర్తి ద్వారా రూ.5,300 చెల్లించి ఒక గ్రాము రీనియం పొడిని సేకరించినట్లు పరిశోధన బృందం పేర్కొంది. దీనిపై దర్యాప్తు సంస్థల లోతైన విచారణ జరిగితేనే అసలు నిజాలు బయటపడతాయి.

ఎక్స్‌ఆర్‌ఎఫ్‌ యంత్రాల పరిమితులపై బీఐఎస్‌ పత్రాల్లోనే హెచ్చరిక!

ప్రస్తుతం నగల దుకాణాలు, హాల్‌మార్కింగ్‌ కేంద్రాల్లో ఆభరణాన్ని కరిగించకుండా ఫలితం ఇచ్చే ఎక్స్‌రే ఫ్లోరోసెన్స్‌ యంత్రాలను వాడుతున్నారు. కానీ, ఈ యంత్రాలు కేవలం ఆభరణం ఉపరితలంపై ఉన్న మూలకాలను మాత్రమే పరీక్షించగలవు. నగ లోపలి భాగంలో దాగి ఉన్న కల్తీని ఇవి గుర్తించలేవు.
2026 సెప్టెంబర్‌లో జరిగిన భారతీయ ప్రమాణాల సంస్థ 165వ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం పత్రాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఆభరణం ఉన్న స్థితిలో చేసే ఎక్స్‌ఆర్‌ఎఫ్‌ పరీక్షను, ఆభరణాన్ని కరిగించి చేసే ప్రామాణిక ‘ఫైర్‌ అస్సే’ పరీక్షకు ప్రత్యామ్నాయంగా పరిగణించలేమని బీఐఎస్‌ స్వయంగా పేర్కొంది. అయితే ‘ఫైర్‌ అస్సే’ పద్ధతిలో నగ నుంచి కొంత భాగాన్ని కత్తిరించాల్సి రావడం, 4 నుంచి 6 గంటల సమయం పట్టడం వల్ల ప్రత్యామ్నాయ సాంకేతికత కోసం ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ కాన్పూర్‌, ఐఐటీ ఢిల్లీ వంటి సంస్థల నుంచి బీఐఎస్‌ పరిశోధనా ప్రతిపాదనలను ఆహ్వానించింది.

65 కోట్ల ఆభరణాలకు హెచ్‌యూఐడీ.. వినియోగదారుడికి నష్టం ఎంత?

దేశంలో ఇప్పటివరకు 65 కోట్లకు పైగా ఆభరణాలకు ఆరు అంకెల ప్రత్యేక హెచ్‌యూఐడీ గుర్తింపు జారీ అయింది. 2.36 లక్షలకు పైగా నగల వ్యాపారులు, 1,565 హాల్‌మార్కింగ్‌ కేంద్రాలు నమోదయ్యాయి. అయితే, ఇంత భారీ సంఖ్యలో ఉన్న దుకాణాలను తనిఖీ చేసేందుకు పర్యవేక్షణ సిబ్బంది సరిపోవడం లేదని బీఐఎస్‌ తన పత్రాల్లోనే అంగీకరించడం గమనార్హం.
ఇలాంటి కల్తీ జరిగితే వినియోగదారుడికి జరిగే నష్టం భారీగా ఉంటుంది. ఉదాహరణకు 10 గ్రాముల (ఒక తులం) 22 క్యారెట్ల నగలో 9.16 గ్రాముల బంగారం ఉండాలి. కానీ జోధ్‌పూర్‌ ప్రయోగంలో మాదిరిగా 8.17 గ్రాములే ఉంటే, నేరుగా ఒక గ్రాము బంగారం లోటు ఏర్పడుతుంది. తులం బంగారం ధర రూ.1.50 లక్షలుగా లెక్కిస్తే, తయారీ ఛార్జీలు, పన్నులు కాకుండానే వినియోగదారుడు ఒక్క తులంపైనే సుమారు రూ.15,000 నష్టపోతాడు. భవిష్యత్తులో ఆ నగను అమ్ముకోవాలన్నా, బ్యాంకుల్లో తాకట్టు పెట్టాలన్నా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.

వినియోగదారులే అప్రమత్తం కావాలి.

బంగారం కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు షోరూమ్‌ హంగులు, బ్రాండ్‌ పేర్లను గుడ్డిగా నమ్మకుండా ప్రతి ఆభరణంపై బీఐఎస్‌ లోగో, స్వచ్ఛత గుర్తు
(22కే 916), ఆరు అంకెల హెచ్యుఐడి నంబర్‌ ఉన్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. తక్షణమే మొబైల్‌లోని ‘బి ఐ ఎస్ కేర్’ యాప్‌లో ఆ హెచ్ యు ఐ డి నంబర్‌ను నమోదు చేసి, యాప్‌లో కనిపించే ఆభరణం ఫొటో, కచ్చితమైన బరువు మీ చేతిలో ఉన్న నగతో సరిపోలుతున్నాయో లేదో నిర్ధారించుకోవాలి. అలాగే పక్కా జీఎస్టీ బిల్లులో రాళ్లు, ముత్యాల బరువును మినహాయించి నికర బంగారం బరువు, తయారీ ఛార్జీలు విడివిడిగా నమోదయ్యేలా చూసుకోవాలి.
కొనుగోలు చేసిన ఆభరణంపై ఏమాత్రం అనుమానం కలిగినా వెంటనే బీఐఎస్‌ గుర్తింపు పొందిన ప్రయోగశాలలో పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ హాల్‌మార్క్‌ వేసిన నగలో ప్రకటించిన దానికంటే బంగారం తక్కువగా ఉన్నట్లు బీఐఎస్‌ ల్యాబ్‌లో నిర్ధారణ అయితే, బీఐఎస్‌ నిబంధనల రూల్‌ 49 ప్రకారం ఆ వ్యత్యాస విలువకు రెండింతల పరిహారంతో పాటు పరీక్షా ఛార్జీలను సదరు వ్యాపారి నుంచి రాబట్టుకునే చట్టపరమైన హక్కు వినియోగదారుడికి ఉంటుంది.

ప్రభుత్వం తక్షణం రంగంలోకి దిగాలి!

జోధ్‌పూర్‌ ప్రయోగంపై కేంద్ర ప్రభుత్వం, బీఐఎస్‌ తక్షణమే స్వతంత్ర విచారణ జరిపి సదరు ఆభరణాన్ని ప్రభుత్వ ప్రయోగశాలలో పరీక్షించాలి. దేశవ్యాప్తంగా అనుమానాస్పద నమూనాలను సేకరించి రీనియం వంటి భారీ లోహాల కల్తీపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలి. అక్రమ దిగుమతులపై కస్టమ్స్‌, డీఆర్‌ఐ నిఘా పెంచాలి. హాల్‌మార్క్‌ అనేది కోట్లాది భారతీయ కుటుంబాల నమ్మకానికి ప్రభుత్వమిచ్చే హామీ. బరువు పెంచి స్వచ్ఛతను దోచుకునే ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపినప్పుడే పసిడి స్వచ్ఛతకూ, వినియోగదారుడి విశ్వాసానికీ నిజమైన రక్షణ లభిస్తుంది.