Mahaa Daily Exclusive

  అఖిలేశ్‌ అయోధ్యలో పోటీ చేస్తే.

Share

  • నేనూ అక్కడి నుంచే బరిలోకి!
  • ఎస్పీ అధినేతకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రతి సవాల్‌.
  • మాఫియా శక్తులపై మళ్లీ ఉచ్చు బిగిస్తామని హెచ్చరిక.

గోరఖ్‌పూర్‌, మహా:

అయోధ్య నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ విసిరిన సవాల్‌కు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఘాటుగా బదులిచ్చారు. అఖిలేశ్‌ అయోధ్య నుంచి నామినేషన్‌ దాఖలు చేస్తే, తాను కూడా అక్కడి నుంచే బరిలోకి దిగుతానని ప్రతి సవాల్‌ విసిరారు. గురువారం గోరఖ్‌పూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం యోగి ప్రసంగిస్తూ సమాజ్‌వాదీ పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ముఖాముఖి పోరుకు సిద్ధం
అయోధ్య వేదికగా తలపడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. ‘‘మీరు అయోధ్య నుంచి నామినేషన్‌ వేస్తే.. నేనూ అక్కడి నుంచే వేస్తాను. ముఖాముఖి పోరు ఎలా ఉంటుందో తేల్చుకుందాం’’ అని అఖిలేశ్‌ యాదవ్‌ను ఉద్దేశించి సవాల్‌ చేశారు. నేరుగా ఎదురొడ్డి పోరాడే ధైర్యం అఖిలేశ్‌కు లేదని, బలహీనమైన వ్యక్తులు ఎప్పుడూ వెనుక నుంచి దాడి చేసేందుకు ప్రయత్నిస్తారని ఆయన ఎద్దేవా చేశారు.
ఎస్పీ హయాంలో అరాచక పాలన..
సమాజ్‌వాదీ పార్టీ మాఫియా శక్తులపై ఆధారపడి రాజకీయాలు చేస్తోందని సీఎం యోగి ఆరోపించారు. గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో యువతకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని, మహిళలు, వ్యాపారుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. ఎస్పీ అంటేనే గూండాయిజం, అరాచకం, అల్లర్లు, కర్ఫ్యూలకు పర్యాయపదమని వ్యాఖ్యానించారు. మాఫియా ముఠాలన్నీ ఆ పార్టీకి మిత్రపక్షాలుగా వ్యవహరించాయని, ప్రజలను మోసం చేయడమే ఆ పార్టీ విధానమని మండిపడ్డారు.
నేరగాళ్లపై ఉక్కుపాదం కొనసాగుతుంది
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని యోగి ఆదిత్యనాథ్‌ హెచ్చరించారు. మాఫియాగిరీకి పాల్పడే వారిని ఏమాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని, వారి ఆగడాలను పూర్తిగా అణచివేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే నేరగాళ్ల కార్యకలాపాలను కట్టడి చేశామని గుర్తుచేసిన ఆయన, అవసరమైతే మరోసారి వారిపై ఉచ్చు బిగించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని ప్రకటించారు. చట్టాన్ని ఉల్లంఘించే గూండాలు, మాఫియా శక్తులపై ఉక్కుపాదం కొనసాగుతుందని తేల్చిచెప్పారు.