• రూ.451.13 కోట్ల పనులకు శంకుస్థాపన.
• రూ.92.98 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.
సిద్దిపేట, మహా:
సిద్దిపేట జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రూ.544.11 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం జిల్లాలో పర్యటించి రూ.451.13 కోట్ల విలువైన నూతన పనులకు శంకుస్థాపనలు, ఇప్పటికే పూర్తయిన రూ.92.98 కోట్ల పనులను ప్రారంభించారు. విద్య, రెవెన్యూ, విద్యుత్ రంగాలతో పాటు ఆలయ అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను కేటాయించారు.
రూ.451.13 కోట్లతో కొత్త పనులు
సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి రూ.200 కోట్ల వ్యయంతో రెండు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. జిల్లాలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.15.44 కోట్లు, ఆరు నూతన తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి రూ.13.50 కోట్లు కేటాయించారు. దౌల్తాబాద్ మండలంలో రూ.7.80 కోట్లు, చిన్నకోడూరు మండలంలో రూ.7.50 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జనగామ నియోజకవర్గంలో మూడు విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి రూ.6.89 కోట్లతో పనులు ప్రారంభించారు.
రూ.92.98 కోట్ల పనులు ప్రారంభం
జిల్లావ్యాప్తంగా రూ.54.67 కోట్లతో నిర్మించిన 14 విద్యుత్ సబ్స్టేషన్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం రూ.14.35 కోట్లతో నిర్మించిన సత్రం, రూ.12 కోట్లతో ఏర్పాటు చేసిన క్యూ కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మహిళా సంఘాల బలోపేతం కోసం రూ.6.50 కోట్లతో నిర్మించిన 53 గ్రామ సంఘాల భవనాలను ప్రారంభించారు. రాయపోల్ మండలంలో రూ.3.87 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనం, గజ్వేల్‌లో రూ.1.59 కోట్లతో నిర్మించిన విద్యుత్ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
రెండు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం
ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని, ‘ఇందిరమ్మ చీరల పంపిణీ’ కార్యక్రమాన్ని సీఎం అధికారికంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, గడ్డం వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ వెంకటస్వామి, మేడిపల్లి సత్యం, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కె. హైమావతి, పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పూజల హరికృష్ణ తదితరులు హాజరయ్యారు.








