• మూడు వారాల గడువు కోరిన ప్రభుత్వం.
• తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా
హైదరాబాద్, మహా:
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల ప్రస్తుత పరిస్థితిపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నివేదిక సమర్పించేందుకు మూడు వారాల గడువు కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరడంతో అంగీకరించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులకు సంబంధించి సీబీఐ 11, ఈడీ 9 అభియోగపత్రాలు దాఖలు చేశాయని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. సుమారు 15 ఏళ్లుగా విచారణ కొనసాగుతోందని, వివిధ కేసుల్లో 150కి పైగా డిశ్చార్జి పిటిషన్లు దాఖలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ఆ పిటిషన్లపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.
రోజువారీ విచారణ చేపట్టాలని విజ్ఞప్తి
డిశ్చార్జి పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో అసలు కేసుల విచారణ ప్రాథమిక దశలోనే నిలిచిపోయిందని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. కేసులను రోజువారీ ప్రాతిపదికన విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నిందితులు విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. 2024లోనే రోజువారీ విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఆశించిన పురోగతి లేదని హరిరామ జోగయ్య తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
న్యాయమూర్తిని ప్రతివాదిగా చేర్చడంపై అభ్యంతరం
ప్రత్యేక కోర్టు ప్రిసైడింగ్ జడ్జిని ప్రతివాదిగా చేర్చడంపై తెలంగాణ హైకోర్టు ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసుల విచారణలో జాప్యం జరుగుతోందనే కారణంతో న్యాయమూర్తులను ప్రతివాదులుగా చేర్చడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో న్యాయపరమైన అంశాలపై సహకారం అందించేందుకు అమికస్ క్యూరీని నియమించే అంశాన్ని పరిశీలించింది. కేసుల పురోగతిపై సమగ్ర వివరాలతో స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.








