Mahaa Daily Exclusive

  నీటి ప్రాజెక్టులపై పీసీసీ చీఫ్‌కు అవగాహన లేదు.

Share

• రేవంత్‌ సర్కార్‌ నీటి హక్కులను తాకట్టుపెట్టింది.
• హరీశ్‌రావు ధ్వజం

హైదరాబాద్‌, మహా:

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు నీటి ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆయన అజ్ఞానానికి చింతిస్తున్నానని వ్యాఖ్యానించారు. పాలమూరు–రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను నిరుపయోగంగా మార్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఆరోపించారు. అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దాసోహమైందని మండిపడ్డారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

ఇన్‌టేక్‌ వెల్‌తో రోజుకు 2 టీఎంసీలు?

కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇన్‌టేక్‌ వెల్‌ నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ నిర్మాణం ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటి హక్కులను కాపాడటంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం కమీషన్లపైనే శ్రద్ధ చూపుతోందని విమర్శించారు. నీటి నిర్వహణలో రేవంత్‌ సర్కారు పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించారు.

నల్లగొండకు అన్యాయం

నాగార్జునసాగర్‌ జలాశయం ఖాళీ అయితే నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీటి ఇబ్బందులు తప్పవని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాకే అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో వినియోగించిన నీటి కంటే కాంగ్రెస్‌ పాలనలో తక్కువ నీటినే వినియోగించారని పేర్కొన్నారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పనితీరుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని హరీశ్‌రావు పేర్కొన్నారు. పాలమూరు, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని, కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్‌ చేశారు.