Mahaa Daily Exclusive

  శివోహం… శివాలయాలకు పోటెత్తిన భక్తులు

Share

శివోహం..

  •  కోటి దీపకాంతుల్లో దేదీప్యమానమైన భారతావని!
  •  వేములవాడ రాజన్న నుంచి కాశీ విశ్వనాథుడి వరకు శివనామస్మరణ.
  •  అరుణాచలంలో మహాదీపం.. గంగాతీరంలో దేవదీపావళి.
  •  పంచారామాలు, జ్యోతిర్లింగ క్షేత్రాల్లో భక్తజన సంద్రం

హైదరాబాద్, మహా,

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమశివుని దివ్యనామస్మరణతో యావత్ భారతావని పులకించింది. సనాతన ధర్మ వైభవానికి, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలిచే కార్తీక పౌర్ణమి మహాపర్వం సందర్భంగా మంగళవారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలు, వైష్ణవాలయాలు, పుణ్యనదీ తీరాలు భక్తజన సందోహంతో కిక్కిరిశాయి. ఎటు చూసినా దీపజ్యోతులు.. ఎటు విన్నా హరహర మహాదేవ నామస్మరణ.. ఎక్కడ చూసినా భక్తిపారవశ్యం. బ్రహ్మముహూర్తం నుంచే గోదావరి, కృష్ణా, తుంగభద్ర, గంగా, సరయూ, శిప్రా నదీ తీరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివకేశవులను దర్శించుకున్నారు. అభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు, జపతపాలతో పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ నుంచి శ్రీశైలం వరకు, పంచారామాల నుంచి తిరుమల తిరుపతి వరకు, అరుణాచలం నుంచి కాశీ విశ్వనాథుడి సన్నిధి వరకు భక్తి వెల్లివిరిసింది. ప్రదోష వేళ జ్వాలాతోరణాలు, నదీ తీరాల్లో కార్తీక దీపాలు, కాశీలో దేవదీపావళి, అరుణాచలంలో మహాదీపోత్సవం భక్తులను భక్తిరససాగరంలో ముంచెత్తాయి. కృత్తికా నక్షత్రం, కార్తిగై దీపోత్సవం, దేవదీపావళి, గురునానక్ జయంతి, బీవర్ సూపర్‌మూన్ వంటి విశేషాలు ఒకే పర్వదినాన రావడంతో ఈ ఏడాది కార్తీక పౌర్ణమి మరింత విశిష్టతను సంతరించుకుంది.

త్రిపురారి పౌర్ణమి.. త్రిలోకాలను పులకింపజేసే శివతత్త్వం

కార్తీక శుక్ల పౌర్ణమికి పురాణ, ఆధ్యాత్మిక పరంగా అత్యంత ప్రాధాన్యం ఉంది. త్రిపురాసురులనే రాక్షసులను సంహరించి లోకకల్యాణం సాధించిన పరమేశ్వరుడిని త్రిపురాంతకుడిగా ఆరాధించే పర్వదినం కావడంతో దీనికి త్రిపురారి పౌర్ణమి అనే పేరు ప్రసిద్ధి చెందింది. త్రిపురాసుర సంహారం అనంతరం దేవతలు పరమేశ్వరుడికి దీపారాధన చేసిన సందర్భాన్ని స్మరించుకుంటూ భక్తులు దీపాలు వెలిగించారు. దేవతలు కాశీ క్షేత్రానికి విచ్చేసి గంగాతీరంలో దీపోత్సవం నిర్వహించిన పవిత్ర సందర్భానికి గుర్తుగా దేవదీపావళి జరుపుకున్నారు.

కార్తీక మాసమంతా దీపారాధనకు విశిష్ట స్థానం ఉన్నప్పటికీ పౌర్ణమి రోజున దీపదానం చేయడం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు పేర్కొంటున్నాయి. 365 వత్తులతో దీపం వెలిగించడం, ఆకాశదీపం ఏర్పాటు చేయడం, నదులు, ఆలయ ప్రాంగణాలు, తులసికోటల వద్ద దీపాలు వెలిగించడం, ఉసిరి చెట్టు వద్ద దీపారాధన చేయడం వంటి సంప్రదాయాలు ఈ పర్వదినానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

శివాలయాల వద్ద నిర్వహించే జ్వాలాతోరణం ఈ పండుగలో మరో ప్రధాన ఘట్టం. ఎండుగడ్డితో తోరణం నిర్మించి అగ్నిప్రజ్వలన చేసిన అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని దాని కింద నుంచి ఊరేగిస్తారు. భక్తులు సైతం భక్తిశ్రద్ధలతో ఆ జ్వాలాతోరణం కింద నుంచి మూడుసార్లు దాటారు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలనే అంతరార్థం ఈ సంప్రదాయంలో అంతర్లీనంగా ఉంది.

తెలంగాణ శైవక్షేత్రాల్లో శివనామస్మరణ

తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ విశేషంగా కనిపించింది. ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో ప్రధాన రాజన్న ఆలయంలోని కొన్ని సేవల నిర్వహణలో మార్పులు చేసి భీమేశ్వరాలయంలో దర్శనాలు కల్పించారు. మధ్యాహ్నానికే సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా. కోడె మొక్కులు, రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు కొనసాగాయి. రాజగోపురం వద్ద ఎల్‌ఈడీ తెరల ద్వారా స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. సాయంత్రం జ్వాలాతోరణ ప్రదక్షిణకు ఏర్పాట్లు చేశారు.

కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. నిజరూప దర్శనం అనంతరం వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ముక్తేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో రుద్రాభిషేకాలు, లక్ష దీపోత్సవం వైభవంగా జరిగాయి.

రామప్ప, మెట్టుగుట్ట, సిద్ధేశ్వరాలయం, నేలశంభుని గుడి, కీసరగుట్ట, యాదాద్రి, చెరువుగట్టు, పానగల్, వాడపల్లి, పిల్లలమర్రి, మోత్కూరు తదితర క్షేత్రాలు భక్తులతో కళకళలాడాయి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. సత్యనారాయణ స్వామి వ్రతాలు, ప్రత్యేక దర్శనాలు కొనసాగాయి. భద్రాచలం, బాసర, ధర్మపురి, మంథని, కోటిలింగాల, అలంపురం, పాలకుర్తి, కూసుమంచి, నిజామాబాద్, బోధన్, ఆదిలాబాద్ ప్రాంతాల్లోని ఆలయాలు దీపకాంతులతో వెలిగిపోయాయి.

హైదరాబాద్‌లోని పలు శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, దీపారాధనలు నిర్వహించారు. గుడిమల్కాపూర్‌లో 11 వేల దీపాలతో దీపోత్సవం నిర్వహించగా, ఏకాంబరేశ్వర ఆలయంలో మంచు శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మెట్టుగుట్టలో ఆకాశదీపం, ఉట్ల కోనేరు ప్రాంతంలో 108 కలశాలతో నిర్వహించిన శోభాయాత్ర ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది.

ఆంధ్రప్రదేశ్‌లో పంచారామాల వైభవం.. శ్రీశైలంలో భక్తజన సంద్రం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవక్షేత్రాలు కార్తీక పౌర్ణమి వేళ భక్తులతో పోటెత్తాయి. శ్రీశైల మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో పాతాళగంగ పుణ్యస్నానాలు, సలిల దీపాలు, కార్తీక దీపారాధనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తుల రద్దీ భారీగా పెరగడంతో ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లలో మార్పులు చేశారు. గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనాలను నిలిపివేసి అలంకార దర్శనానికి ప్రాధాన్యం కల్పించారు. సాయంత్రం జ్వాలాతోరణం, పుష్కరిణిలో లక్ష దీపోత్సవం, ప్రత్యేక హారతులకు ఏర్పాట్లు చేశారు.

అమరావతి అమరారామం, ద్రాక్షారామం, భీమవరం సోమారామం, పాలకొల్లు క్షీరారామం, సామర్లకోట కుమారారామం.. ఈ పంచారామ క్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది. శైవ సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచే ఈ ఐదు క్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు నిర్వహించారు.

శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు, స్వామివారి అభిషేకాలు కొనసాగాయి. మహానందిలో జ్వాలాతోరణం, కార్తీక కోటి దీపోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వెయ్యి జంటలతో నిర్వహించిన కోటి దీపోత్సవం వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాగంటి, కాల్వబుగ్గ క్షేత్రాల్లోనూ భక్తులు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు.

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సుమారు 8.2 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ నిర్వహించారు. సుమారు లక్షన్నర మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు అంచనా. సత్యదేవుని సత్యరథం, పంపా నదీ హారతులు, జ్వాలాతోరణం కార్యక్రమాలు ఉత్సవ వైభవాన్ని చాటిచెప్పాయి.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధిలోనూ కార్తీక దీపోత్సవ ఏర్పాట్లు చేశారు. కామధేను ఆలయం నుంచి గిరిప్రదక్షిణ, కృష్ణా నదీ తీరంలో దీపారాధనలు, అరటి దొప్పల్లో దీపాలు వెలిగించే కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. తిరుమల, తిరుపతి, రాజమహేంద్రవరం, కొవ్వూరు గోష్పాద క్షేత్రం, నరసాపురం, హంసలదీవి, మంగినపూడి, సూర్యలంక తదితర ప్రాంతాల్లోనూ కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి.

కాశీలో దేవదీపావళి.. గంగాతీరంలో 11 లక్షల దీపాల కాంతులు.

భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో విశిష్ట స్థానం కలిగిన కాశీ క్షేత్రం కార్తీక పౌర్ణమి సందర్భంగా అపూర్వమైన దీపకాంతులతో దేదీప్యమానమైంది. దేవదీపావళి ఉత్సవం కోసం వారణాసిలోని గంగానదీ ఘాట్లను సర్వాంగసుందరంగా అలంకరించారు. దశాశ్వమేధ, అస్సీ, రాజేంద్రప్రసాద్, శీతలా, సింధియా, తులసి, దర్భంగా, రాజ్‌ఘాట్ తదితర ఘాట్లలో తెల్లవారుజాము నుంచే భక్తుల రాక కొనసాగింది. గంగాస్నానాలు, కాశీ విశ్వనాథుడికి జలాభిషేకాలు నిర్వహించారు.

సాయంత్రం 88 ఘాట్లు, ఇసుక తిన్నెలు, 103 కుండాల వద్ద 11 లక్షలకు పైగా దీపాలు వెలిగించేలా ఏర్పాట్లు చేశారు. వీటిలో 10 లక్షల మట్టి ప్రమిదలు, లక్ష ఆవుపేడతో తయారుచేసిన దీపాలు ఉండటం పర్యావరణ హిత ఆధ్యాత్మికతకు నిదర్శనంగా నిలిచింది.

దశాశ్వమేధ ఘాట్‌లో 51 వేల దీపాల మధ్య గంగా సేవా నిధి ఆధ్వర్యంలో 21 మంది అర్చకులు, 42 మంది దేవకన్యలతో నిర్వహించే మహాహారతికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమరవీరులకు నివాళులు, గంగమ్మకు పాలాభిషేకం, ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకల్లో భాగమయ్యాయి.

చేత్‌సింగ్ ఘాట్‌లో త్రీడీ ప్రొజెక్షన్, లేజర్ ప్రదర్శనతో పాటు 2,100 డ్రోన్లతో నిర్వహించే ఆకాశ ప్రదర్శన ఈ ఏడాది దేవదీపావళికి మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అనంతరం పర్యావరణహిత బాణసంచా ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. దేశవిదేశాల నుంచి వచ్చిన పర్యాటకులతో కాశీ వీధులు, ఘాట్లు సందడిగా మారాయి. భక్తుల రాకతో హోటళ్లు, పడవలు, క్రూజ్‌లకు భారీ డిమాండ్ ఏర్పడింది. స్థానిక కుమ్మరులు, నావికులు, పూల వ్యాపారులు, చేనేత కార్మికులకు ఈ ఉత్సవం ఉపాధి అవకాశాలను పెంచింది.

అరుణాచలంలో మహాదీపం.. 50 లక్షల మంది భక్తుల హాజరు.

తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి క్షేత్రంలో కార్తిగై దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అరుణాచల పర్వతాన్ని సాక్షాత్తూ శివస్వరూపంగా భావించే భక్తులు గిరిప్రదక్షిణ చేయడం ఇక్కడి విశిష్ట సంప్రదాయం.

పర్వత శిఖరంపై మహాదీపం వెలిగించడం ఈ ఉత్సవంలో అత్యంత పవిత్రమైన ఘట్టం. సుమారు 2,668 అడుగుల ఎత్తులోని కొండపై ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ పాత్రలో నెయ్యి, వత్తులతో మహాజ్యోతిని ప్రజ్వలింపజేస్తారు. ఈ దీపాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ మార్గంలో సుమారు 50 లక్షల మంది భక్తులు పాల్గొన్నారనిఅంచనా. వర్షాల నేపథ్యంలో భద్రతా కారణాలతో కొండపైకి భక్తుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. ఆన్‌లైన్ దర్శన పాసుల ద్వారా భక్తుల రాకను క్రమబద్ధీకరించారు.

జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు.. హరిహర నామస్మరణ.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. శిప్రా నదిలో పుణ్యస్నానాలు, దీపదానాలు, మహాకాళేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. హరి–హర మిలన సంప్రదాయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

గుజరాత్‌లోని సోమనాథ్ క్షేత్రంలో సముద్రతీర పుణ్యస్నానాలు, ప్రత్యేక మహాపూజలు, హారతులు నిర్వహించారు. త్ర్యంబకేశ్వర్‌లోని కుశావర్త తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఓంకారేశ్వరం, హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, అయోధ్య, చిత్రకూట్, పూరీ, రామేశ్వరం, మధురై, చిదంబరం, శృంగేరి తదితర పుణ్యక్షేత్రాలు కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక శోభతో అలరారాయి.

అయోధ్యలో సరయూ నదీ తీరంలో భక్తుల సందడి నెలకొంది. పూరీ జగన్నాథ క్షేత్రంలో ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించారు. కటక్‌లో బాలి జాతర, పుష్కర్‌లో మేళా ముగింపు వేడుకలు, శృంగేరిలో లక్షదీపోత్సవం దేశవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వైభవాన్ని చాటిచెప్పాయి.

తిరుమలకు భారీ బంగారు కానుక.. దాతృత్వంలో భక్తిభావం.

కార్తీక మాసంలో ఆలయాలకు భక్తులు సమర్పిస్తున్న కానుకలు, విరాళాలు విశేషంగా నిలుస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెన్నైకి చెందిన ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించేందుకు ముందుకొచ్చారు. సుమారు 45 నుంచి 46 రకాలుగా రూపొందించిన తొమ్మిది సెట్ల ఆభరణాల తయారీకి 15 నెలల సమయం పట్టినట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ.140 కోట్ల నుంచి రూ.160 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నవంబర్ 26న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఆభరణాలను సమర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అలాగే కాప్‌స్టన్ సంస్థ ఎండీ కొడాలి శ్రీకాంత్ తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 కోట్ల విరాళం అందించారు. ప్రవాస భారతీయుడు యక్ష ప్రణయ్ కుమార్ రెడ్డి వేములవాడ రాజన్న ఆలయానికి రూ.35,016 విరాళంగా సమర్పించారు. మరోవైపు తుమ్మల నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతులు కోటి దీపోత్సవంలో భాగంగా 17 రోజులపాటు భక్తులకు ఉచితంగా పూజా సామగ్రిని అందించే కార్యక్రమం చేపట్టారు.

భక్తుల రవాణాకు ప్రత్యేక ఏర్పాట్లు.. భద్రతకు ప్రాధాన్యం

కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రవాణా సంస్థలు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పుణ్యక్షేత్ర దర్శిని పేరిట పలు క్షేత్రాలకు ప్రత్యేక యాత్రా ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వేములవాడ, కాళేశ్వరం, రామప్ప, కొండగట్టు, ధర్మపురి, శ్రీశైలం, ఉమామహేశ్వరం తదితర క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హనుమకొండ నుంచి అరుణాచలం, శబరిమల యాత్రలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో పంచారామ క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. సముద్రతీర ప్రాంతాలకు వెళ్లే భక్తుల కోసం అదనపు సర్వీసులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక రైలు సర్వీసులు కూడా యాత్రికులకు ఉపయుక్తంగా మారాయి.

నదీ తీరాలు, సముద్ర తీరాల్లో భక్తుల భద్రత కోసం గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు, పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. కాశీలో ఘాట్ల వారీగా భద్రతా విభాగాలను ఏర్పాటు చేయగా, అరుణాచలంలో వర్షాల నేపథ్యంలో కొండపైకి వెళ్లకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు.

దీపజ్యోతి వెనుక జీవన సందేశం.. తమసో మా జ్యోతిర్గమయ

కార్తీక పౌర్ణమి కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు. అది మానవ జీవితానికి వెలుగుదారి చూపించే ఆధ్యాత్మిక మహోత్సవం. దీపంలోని వత్తి, నూనె, జ్యోతి మనిషి అంతరంగంలోని ఆధ్యాత్మిక భావనలకు ప్రతీకలుగా భావించే సంప్రదాయం మన సంస్కృతిలో కనిపిస్తుంది. మనలోని అజ్ఞానం, అహంకారం, అసూయ, ద్వేషం వంటి అంధకారాలను తొలగించి సత్యం, ధర్మం, కరుణ, సేవ, సద్భావనలతో కూడిన జీవితాన్ని గడపాలనే సందేశాన్ని కార్తీక దీపం అందిస్తుంది.

మట్టి ప్రమిదలో వెలిగే చిన్న దీపం కూడా చీకటిని తొలగించగలదనే సత్యం మానవ జీవితానికి గొప్ప పాఠం. అందుకే కార్తీక పౌర్ణమి సందర్భంగా మట్టి ప్రమిదలు, అరటి దొప్పల దీపాలు, ఆవుపేడతో తయారుచేసిన పర్యావరణహిత దీపాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. భక్తి పేరుతో ప్రకృతికి హాని కలిగించకుండా సంప్రదాయాలను పరిరక్షించుకోవాలనే చైతన్యం కూడా ఈ వేడుకల్లో ప్రతిబింబిస్తోంది.

కాశీ గంగాతీరంలో వెలిగే లక్షలాది దీపాలైనా, అరుణాచల పర్వత శిఖరంపై ప్రజ్వలించే మహాజ్యోతైనా, వేములవాడ రాజన్న సన్నిధిలో వెలిగే ప్రమిదైనా.. వాటి అంతరార్థం ఒక్కటే. చీకటి నుంచి వెలుగులోకి, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి, స్వార్థం నుంచి సేవాభావంలోకి, భౌతికత నుంచి ఆధ్యాత్మికతలోకి మానవాళిని నడిపించడమే ఈ మహాపర్వ సందేశం.

“తమసో మా జ్యోతిర్గమయ.. మృత్యోర్మా అమృతంగమయ” అనే ఉపనిషత్తుల మహావాక్యం కార్తీక పౌర్ణమి పరమార్థాన్ని చాటిచెబుతోంది. భక్తి అనే పునాదిపై ధర్మం అనే మార్గంలో నడుస్తూ, జ్ఞానం అనే జ్యోతిని ప్రతి హృదయంలో వెలిగించుకోవాలని ఈ పర్వదినం ప్రబోధిస్తోంది.

దీపాల వెలుగుల్లో దేదీప్యమానమైన భారతావని.. శివనామస్మరణతో పులకించిన భక్తకోటి.. హరిహరుల అనుగ్రహం కోసం పరితపించిన ఆధ్యాత్మిక జనసందోహం.. ఇవన్నీ కలగలిపి కార్తీక పౌర్ణమిని భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ వైభవానికి ప్రతీకగా నిలిపాయి.

హరహర మహాదేవ.. శంభో శంకర.. ఓం నమః శివాయ!