Mahaa Daily Exclusive

  ఐదు హెల్త్‌ కంపెనీల లైసెన్సులు సస్పెండ్‌!

Share

ఐదు హెల్త్‌ కంపెనీల లైసెన్సులు సస్పెండ్‌!
* గడువు ముగిసిన పదార్థాల వినియోగం.
* ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చర్యలు.

న్యూఢిల్లీ, మహా:

ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించిన ఐదు న్యూట్రాస్యూటికల్‌, హెల్త్‌ ప్రొడక్టుల తయారీ సంస్థలపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) చర్యలు చేపట్టింది. తనిఖీల్లో తీవ్ర నిబంధనల ఉల్లంఘనలు గుర్తించడంతో ఐదు సంస్థల లైసెన్సులను తక్షణమే సస్పెండ్‌ చేసింది. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఆహార భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

లైసెన్సులు సస్పెండ్‌ అయిన సంస్థల్లో వేదాంత్‌ రెమెడీస్‌, లూసిడ్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అంబికో ఆయుర్వేదిక్‌ హెల్త్‌కేర్‌, విటామెడిక్‌ హెల్త్‌ న్యూట్రాస్యూటికల్స్‌, అడోరియల్‌ హెల్త్‌కేర్‌ ఉన్నాయి. ఈ సంస్థల తయారీ కేంద్రాల్లో పరిశుభ్రత లోపాలు, నిల్వ విధానాల్లో నిర్లక్ష్యం, లైసెన్సింగ్‌ నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తనిఖీల్లో గుర్తించినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది.

పరిశుభ్రత లోపాలు.. గడువు ముగిసిన పదార్థాలు

వేదాంత్‌ రెమెడీస్‌ కేంద్రంలో పరిశుభ్రత, పురుగుల నియంత్రణలో లోపాలతోపాటు గడువు ముగిసిన ఫ్లేవరింగ్‌ పదార్థాలను గుర్తించారు. ఆయుష్‌, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతులున్న పదార్థాలను వేర్వేరుగా నిల్వ చేయకపోవడంతో కలుషితమయ్యే ప్రమాదం ఉందని అధికారులు గుర్తించారు. సరైన ఆహార భద్రతా లైసెన్సు లేకుండానే కొన్ని ఉత్పత్తుల తయారీ జరిగినట్లు తేలింది. ఈ కేంద్రం నిబంధనల అమలులో కేవలం 12 శాతం మార్కులే సాధించింది.

లూసిడ్‌ హెల్త్‌కేర్‌లోనూ పరిశుభ్రత, పురుగుల నియంత్రణలో లోపాలు బయటపడ్డాయి. ఆయుర్వేద, న్యూట్రాస్యూటికల్‌ ఉత్పత్తుల తయారీ విభాగాల మధ్య సరైన విభజన లేదని, కార్మికులకు తప్పనిసరి పరిశుభ్రత శిక్షణ కూడా అందలేదని అధికారులు గుర్తించారు. ఈ సంస్థకు 27 శాతం సమ్మతి స్కోరు నమోదైంది.

అంబికో ఆయుర్వేదిక్‌ హెల్త్‌కేర్‌ కేంద్రంలో అపరిశుభ్ర వాతావరణం, గడువు ముగిసిన పదార్థాల నిల్వను గుర్తించారు. ఆహార భద్రత, పరీక్షలకు సంబంధించిన తప్పనిసరి రికార్డులు కూడా నిర్వహించలేదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. ఈ సంస్థకు 46 శాతం సమ్మతి స్కోరు మాత్రమే లభించింది.

లైసెన్సులో ఒక చిరునామా.. కార్యకలాపాలు మరోచోట!

విటామెడిక్‌ హెల్త్‌ న్యూట్రాస్యూటికల్స్‌, అడోరియల్‌ హెల్త్‌కేర్‌ సంస్థల లైసెన్సుల్లో పేర్కొన్న తయారీ కేంద్రాలు పనిచేయడం లేదని తనిఖీల్లో వెల్లడైంది. విటామెడిక్‌ సంస్థ లైసెన్సులో నమోదైన చిరునామా నుంచి మరో ప్రాంతానికి కార్యకలాపాలు మార్చినా, ఆ మార్పును అనుమతుల్లో నమోదు చేయలేదని అధికారులు గుర్తించారు. అడోరియల్‌ సంస్థకు చెందినట్లు పేర్కొన్న కేంద్రంలో నిర్మాణ పనులు జరుగుతుండగా, అక్కడి ప్రస్తుత యజమానులు ఆ సంస్థతో తమకు సంబంధం లేదని చెప్పినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెల్లడించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఐదు సంస్థల లైసెన్సులను తక్షణమే సస్పెండ్‌ చేసినట్లు ఆహార నియంత్రణ సంస్థ ప్రకటించింది. న్యూట్రాస్యూటికల్‌ ఉత్పత్తుల తయారీ, విక్రయాల్లో నిబంధనల ఉల్లంఘనలను సహించబోమని స్పష్టం చేసింది.