Mahaa Daily Exclusive

  పశ్చిమబెంగాల్‌ పేరు మార్పునకు కేబినెట్‌ ఆమోదం!

Share

పశ్చిమబెంగాల్‌ పేరు మార్పునకు కేబినెట్‌ ఆమోదం!
* ‘పశ్చిమ బంగ’గా రాష్ట్రానికి కొత్త పేరు.
* డిసెంబర్‌ 9న అసెంబ్లీలో తీర్మానం.

కోల్‌కతా, మహా:

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం పేరు మార్పు దిశగా కీలక అడుగు పడింది. రాష్ట్రం పేరును ‘పశ్చిమ బంగ’ గా మార్చేందుకు ముఖ్యమంత్రి సువేందు అధికారి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ మేరకు డిసెంబర్‌ 9న రాష్ట్ర శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ ఆమోదం పొందిన అనంతరం తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.

ప్రస్తుతం ‘వెస్ట్‌ బెంగాల్‌’గా ఆంగ్లంలో వ్యవహరిస్తున్న రాష్ట్ర పేరును కూడా ‘పశ్చిమ బంగ’గా మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. బెంగాలీ, హిందీ, ఆంగ్ల భాషల్లో ఒకే పేరును కొనసాగించాలన్నది ఈ ప్రతిపాదన ఉద్దేశం. 1947లో బెంగాల్‌ విభజన నేపథ్యంలో ఏర్పడిన రాష్ట్ర చరిత్రతో ఈ పేరు మార్పునకు సంబంధం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

గతంలోనూ పలుమార్లు ప్రయత్నాలు

రాష్ట్రం పేరు మార్పు అంశం గతంలోనూ చర్చకు వచ్చింది. 2011లో మమతా బెనర్జీ ప్రభుత్వం ‘పశ్చిమ బంగ’ పేరును ప్రతిపాదించగా, 2016లో బెంగాలీలో ‘బంగ్లా’, ఆంగ్లంలో ‘బెంగాల్‌’, హిందీలో ‘బంగాల్‌’ పేర్లను సూచించింది. అనంతరం 2018లో మూడు భాషల్లోనూ ‘బంగ్లా’ పేరును ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయితే కేంద్రం నుంచి ఆ ప్రతిపాదనలకు ఆమోదం లభించలేదు. తాజాగా సువేందు అధికారి ప్రభుత్వం ‘పశ్చిమ బంగ’ పేరుతో మరోసారి ప్రక్రియను ప్రారంభించింది.

అసెంబ్లీ తీర్మానం ఆమోదం పొందినంత మాత్రాన రాష్ట్రం పేరు వెంటనే మారదు. కేంద్ర ప్రభుత్వ పరిశీలనతో పాటు పార్లమెంటు ఆమోదం, రాజ్యాంగపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాతే పేరు మార్పు అధికారికంగా అమల్లోకి వస్తుంది. డిసెంబర్‌ 4 నుంచి 14 వరకు జరగనున్న శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఈ అంశం కీలకంగా మారనుంది.