బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం విచారణకు రావాలని కౌశిక్ రెడ్డిని ఆదేశించారు. అయితే గుురవారం కరీంనగర్ కోర్టుకు హాజరుకావాల్సి ఉందని, అందువల్ల శుక్రవారం విచారణకు హాజరవుతానని కౌశిక్ రెడ్డి తెలిపారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. గతనెల 4న తన ఫోన్ ట్యాప్ అవుతుందని కౌషిక్ రెడ్డి బంజారాహిల్స్ పీఎస్‌కి వచ్చారు. అదే సమయంలో బయటకు వెళ్తున్న ఇన్స్పెక్టర్ రాఘవేందర్ వాహనానికి తన వాహనాన్ని అడ్డు పెట్టి అనుచరులతో కలిసి పీఎస్‌లో హల్చల్ చేశారు. తన విధులు అడ్డుకోవడమే కాకుండా బెదిరింపులకు దిగిన వ్యవహారంపై ఇన్స్పెక్టర్ రాఘవేందర్ ఫిర్యాదుపై అదే పీఎస్‌లో కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ పరశురాంను వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నియమించారు. ఇందులో భాగంగా మాసబ్ ట్యాంక్ పోలీసులు కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. తనపై అన్యాయంగా కేసులు పెడితే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రశ్నిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ శిక్షణ ఇచ్చిన బిడ్డను ఏ మాత్రం భయపడను అని స్పష్టం చేశారు. తాను తప్పు చేసినట్లు రుజువైతే ఉరి తీయండని సవాల్ విసిరారు. తన అరెస్టు, కరీంనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాజాగా తనకు మళ్ళీ పోలీసులు నోటీసులు ఇచ్చారని తెలిపారు.








