జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి 15వ వార్డు కౌన్సిలర్ భర్త నాగవెల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు పట్టణంలోని రెడ్డి కాలనీలో అదును చూసి కత్తులతో విచక్షణారహితంగా పొడవడంతో రాజలింగమూర్తి కుప్పకూలిపోయాడు. కొద్దిసేపు మృత్యువుతో పోరాడి తనువు చాలించాడు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై కేసీఆర్, మాజీ మంత్రులతో పాటు సదరు గుత్తేదారు కంపెనీలపై రాజలింగమూర్తి కేసు నమోదు చేసి వెలుగులోకి వచ్చాడు.
ఫిబ్రవరి 20న విచారణ..
కాళేశ్వరం నీటి పారుదల ప్రాజెక్టులో అవకతవకాలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, మాజీ మంత్రి టీ. హరిశ్ రావు ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ భూపాల్‌పల్లి జిల్లా కోర్టులో గతంలో పిటిషన్ దాఖలైంది. భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణను కొనసాగించే స్టే ను తెలంగాణ హైకోర్టు పొడిగించింది. ఈ అంశంపై ఫిబ్రవరి 20న విచారణ చేపట్టనున్నట్లు చెప్పింది. విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ హత్య జరగడం కలకలం రేపింది.







