Mahaa Daily Exclusive

  లిథియం ఎక్స్‌ప్లొరేషన్ విషయంలో భారత్-అర్జెంటీనా మధ్య కీలక ఒప్పందం…!

Share

లిథియం ఎక్స్‌ప్లొరేషన్‌తో పాటు, గనుల రంగంలో పరస్పర సహకారం విషయంలో భారత్, అర్జెంటీనా దేశాల మధ్య బుధవారం ఢిల్లీలో కీలక ఒప్పందం జరిగింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, అర్జెంటీనాలోని కెటమార్కా గవర్నర్ రౌల్ అలెజాండ్రో జలీల్ ల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. కేంద్ర గనుల శాఖకు చెందిన పీఎస్ యూ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (ఎంఈసీఎల్ ), అర్జెంటీనాలోని కెటమార్క ప్రోవిన్షియల్ ప్రభుత్వం మధ్య ఈ కీలకమైన అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో క్రిటికల్ మినరల్స్ విషయంలో వనరుల అభివృద్ధి, మినరల్స్ ఎక్స్‌ప్లొరేషన్ అంశాల్లో పరస్పర సహకారం అందించుకోవడం మరింత సులభం కానుంది. అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కెటమార్కా గవర్నర్ జలీల్ మధ్య ఇరుదేశాలకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన చర్చ జరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, పునరుత్పాదక శక్తి నిల్వలో ఎంతో కీలకమైన మినరల్స్ ఖనిజాలపై భారతదేశంలో పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా.. ‘లిథియం ట్రయాంగిల్’లో భాగమైన అర్జెంటీనా తోడ్పాటు అవసరమని.. ఈ విషయంలో అర్జెంటీనాతో పరస్పర సహకారంతో పనిచేసేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాబిల్, పలు ప్రయివేట్ సంస్థలు అర్జెంటీనాలో లిథియం ఎక్స్‌ప్లొరేషన్ ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. రానున్న 4-5 ఏళ్లలో మైనింగ్ పూర్తిస్థాయిలో ప్రారంభం కానుందని కిషన్ రెడ్డి తెలియజేశారు.

అనంతరం కెటమార్కా గవర్నర్ మాట్లాడుతూ.. తమ దేశంలో గనుల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని భారత కంపెనీలను ఆహ్వానించారు. ఇందుకోసం సింగిల్ విండో సిస్టమ్ ద్వారా సహకారం అందించనున్నట్లు ఆయన తెలిపారు. పెట్టుబడులకు అవకాశాలు, దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలు, క్రిటికల్ మినరల్స్ విషయంలో జాయింట్ వెంచర్లతోపాటు తదితర అంశాలపై ఇరు పక్షాలు లోతుగా చర్చించాయి. ఇరు దేశాలకు లాభం చేకూరేలా పాలసీ విధివిధానాలు, నియంత్రణ తీరు, సుస్థిరమైన మైనింగ్ వంటి అంశాలు కూడా చర్చించారు.తాజా ఒప్పందంతో క్రిటికల్ మినరల్స్ రంగంలో భారత్, అర్జెంటీనా మధ్య సత్సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు బాటలు పడనున్నాయి. ఈ ఒప్పందంతో లిథియం అన్వేషణలో పురోగతి, వనరుల లభ్యతతో పాటు లాటిన్ అమెరికాలోని మైనింగ్ రంగంలో భారత్ కంపెనీలకు సరికొత్త అవకాశాలకు దారులు తెరుచుకున్నాయి.

Latest