హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీ సేవల సంస్థ మాజిల్లానిక్ క్లౌడ్ తెలంగాణలో భారీ ఎత్తున కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. భవిష్యత్తు ప్రణాళికలను వివరించేందుకు కంపెనీ ఫిబ్రవరి 17న హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజిల్లానిక్ క్లౌడ్ సంస్థ ఎండీ, గ్లోబల్ సీఈవో జోసెఫ్ సుధీర్ తుమ్మా మాట్లాడుతూ.. మాజిల్లానిక్ క్లౌడ్ సుమారు రూ.400 కోట్లతో కంపెనీలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోందని చెప్పారు. ఐటీ, డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డెవాప్స్, ఈ-సర్వియలెన్స్(E Surveillance) వంటి విభాగాల్లో ఈ కొనుగోళ్లు చేపట్టనున్నట్లు వివరించారు. సంస్థ రూ.200 కోట్లతో ఒక కంపెనీని కొనుగోలు చేయనుండగా జూలై నాటికి మరో రూ.150 కోట్లతో మరో కొనుగోలును చేపట్టనున్నట్లు సుధీర్ వెల్లడించారు. వీటితో పాటు మిగిలిన మొత్తంతో మరో నాలుగైదు చిన్న కంపెనీలను చేజిక్కించుకోవాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కంపెనీకి చెందిన అన్ని విభాగాల్లో దాదాపు 1,600 మంది ఉద్యోగులు ఉన్నారని, వచ్చే రెండేళ్లలో అదనంగా 3,500 నియామకాలు చేపట్టడం ద్వారా మొత్తం ఉద్యోగుల సంఖ్య 5 వేలకుపైగా చేరుకుంటుందని చెప్పారు. కాగా కంపెనీ అనుబంధ సంస్థ స్కాన్ డ్రోన్ ఈ మధ్యనే కార్గోమ్యాక్స్ 200కే హెచ్‌సీ డ్రోన్‌ను ఆవిష్కరించిందని సుధీర్ తెలిపారు. ఈ డ్రోన్ 200 కిలోల వరకు పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాగా.. మాజిల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్ ఇటీవల నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో(NSE) లిస్టయిన విషయం విదితమే.







