వారి మాటలు తూటాల్లా దూసుకుపోతుంటాయి.. ప్రత్యర్థి వర్గాల్లో గుబులు రేపుతుంటాయి. అలాంటి ఫైర్ బ్రాండ్స్ ఒకే వేదికపై ఆసీనులు కావడంలో సర్వత్రా ఉత్కంఠ.. అంతటా ఆసక్తికరం.. అందరి దృష్టి వారిద్దరిపైనే కేంద్రీకృతమైంది. పైగా రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శల పర్వం.. మాటల యుద్ధం పీక్ స్థాయిలో నడుస్తోంది. సరిగ్గా ఇలాంటి వేళ ఇద్దరూ ఒకే వేదికపై సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎంపీ డీకే అరుణ అసీనులు కావడంతో సీన్ ఆసక్తికరంగా మారింది.
శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలో పర్యటించారు. అప్పక్ పల్లెలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ ప్రారంభించారు. అనంతరం అక్కడి మహిళా సమాఖ్య సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వేదికపై రేవంత్ రెడ్డితో పాటు ఎంపీ డీకే అరుణ, మంత్రి సీతక్క తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, డీకే అరుణ సరదాగా మాట్లాడుకోవడం ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఉప్పు నిప్పుగా ఉన్న ఈ ఇరువురు నేతలు తాజాగా నారాయణపేట జిల్లా పర్యటనలో సరదాగా కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శల పర్వం పీక్స్ కు చేరుకుంది. ఏ చిన్న అవకాశం దొరికినా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ నేతలు పంచ్ డైలాగులతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంగా సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ డీకే అరుణకు మధ్య రాజకీయ విభేదాలు అందరికీ తెలిసిందే. సందర్భం వస్తే ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు విరుచుకుపడుతు రాజకీయాన్ని మరింత ఆసక్తిగా మారుస్తుంటారు. అటువంటిది ఈ ఇరువురు నేతలు ఇప్పుడు ఒకే వేదికను పంచుకోవడం సరదాగా ముచ్చటించుకోవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.







