Mahaa Daily Exclusive

  ఖోఖో వ‌ర‌ల్డ్ క‌ప్-2025 సాధించిన భార‌త్ జ‌ట్టుస‌భ్యుల్లో ఆదిలాబాద్ త‌పాల ఉద్యోగి …!

Share

ఖోఖో-2025 వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించిన భార‌త జ‌ట్టులో ఆదిలాబాద్ త‌పాల ప్ర‌ధాన కార్యాల‌యంలో త‌పాల స‌హాయ‌కుడిగా ప‌ని చేస్తున్నశివారెడ్డి ప్రాతినిధ్యం వ‌హించారు..మొత్తం 21 దేశాలు పాల్గొన్న పోటీల‌లో భార‌త్ స‌త్తా చాటింది..నేపాల్ తో జ‌రిగిన ఫైన‌ల్లో అద్భుతంగా ఆడి ట్రోఫీ గెలుచుకుంది. ఈ టోర్నీలో శివారెడ్డి బెస్ట్ అటాక‌ర్ గా అవార్డ్ కూడా అందుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఒక వ‌ర‌ల్డ్ క‌ప్ 34 జాతీయ మ్యాచులాడిన అత‌ను ఖోఖోను ఒలింపిక్స్ లో ప్ర‌వేశ పెడితే భార‌త్ త‌ర‌పున ఆడాల‌ని ఉందంటున్నాడు. ఖోఖో ఇంట‌ర్నేష‌న‌ల్ ప్లేయ‌ర్ పోతిరెడ్డి శివారెడ్డి తో మ‌హా ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ

మీ ఖోఖో ప్ర‌స్థానం ఎలా మొద‌లైంది.?

మాది ప్ర‌కాశం జిల్లా ఈద‌ర గ్రామం.నాకు చిన్న‌ప్ప‌టినుండి ఖోఖో అంటే ఇష్టం. ఎందుకంటే మా ఊరిలో ఖోఖో ఎక్కువగా ఆడేవారు. అంతేకాదు మా పీఈటీ స‌ర్ కాశీ విశ్వనాథరెడ్డి అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు కావ‌డంతో నాతోపాటు ఎంద‌రో మంది క్రీడాకారులను తీర్చిదిద్దారు.19ఏళ్లుగా ఖోఖో ఆడుతున్నాను.

కుటుంబ నేప‌ధ్యం,కుటుంబ స‌భ్యుల‌ స‌హ‌కారం ఎలా ఉండేది.?

మా అమ్మ‌ కోటేశ్వరమ్మ గృహిణి ,నాన్న‌ గురువారెడ్డి పోలియో వ్యాధితో కాలు ప‌డిపోయింది. మాది వ్య‌వ‌సాయ కుటుంబం . తమ్ముడు పరమేశ్వర్ రెడ్డి గ్రామ స‌ర్వేయ‌ర్ గా ప‌ని చేస్తున్నాడు. ఖోఖో ప‌ట్ల‌ నా ఇష్టాన్ని గ‌మ‌నించి త‌ల్లిదండ్రుల‌తో పాటు సోద‌రుడు ప్రోత్సహించారు. నా ఆట‌తీరును గుర్తించి 2009లో మా వ్యాయామ ఉపాధ్యాయుడు కాశీ విశ్వనాథరెడ్డి బాపట్ల జిల్లా పుంగలూరు ఎస్.ఆర్ ఖోఖో అకాడమీలో చేర్పించారు. అక్క‌డ శిక్షకుడు సీతారామరెడ్డి సార‌ధ్యంలో ఆట‌లో మెళ‌కువలు నేర్చుకున్నాను. అక్క‌డ శిక్ష‌ణ అనంత‌రం ప‌లు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్నాను.

ఇప్ప‌టి వ‌ర‌కు ఖోఖో లో ఏమేమి సాధించారు.?

2018లో సీనియ‌ర్ స్టేట్ మెంట్ ట్రోఫీ విజయంతో ప్ర‌స్థానం మొద‌లైంది. ఇప్ప‌టి వ‌ర‌కు 34 జాతీయ‌, 1 అంత‌ర్జాతీయ పోటీల‌లో పాల్గొన్నాను. పోటీల‌లో ప‌లు ట్రోఫీల‌తో పాటు 3 బంగారు, 4 వెండి, 8 కాంస్య ప‌త‌కాలు గెలుచుకున్నాను. డిగ్రీ వ‌ర‌కు చ‌దువుకున్న నేను 2022 లో స్పోర్ట్స్ కోటాలో త‌పాల శాఖ లో ఉద్యోగం పొందారు. ఫ‌స్ట్ అప్పాయింట్ మెంట్ ఆదిలాబాద్ ప్ర‌ధాన త‌పాల కార్యాల‌యంలో త‌పాలా స‌హాయ‌కుడిగా విధుల్లో చేరాను.

ఇత‌రుల ప్రోత్సాహం ఎంత‌వ‌ర‌కుంది.?

నేను ఇంత‌లా ఎద‌గ‌డానికి మా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఖోఖో అసోషియేష‌న్ సెక్ర‌ట‌రీ సీతారామరెడ్డి, అధ్య‌క్షులు టీయ‌స్ ఆర్ కె ప్ర‌సాద్ అలాగే తెలంగా ఖోఖో అసోషియేష‌న్ సెక్ర‌ట‌రీ కృష్ణ‌మూర్తి అధ్య‌క్షులు జంగా రామిరెడ్డి ల కృషి తోడ్పాటు ఎంతో ఉంది.

మ‌రి ఇక్క‌డ ప్రాక్టీస్ ఎలా సాగుతోంది.?

ఇక్క‌డ నా రూమ్మేట్ అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు కోచ్ అయిన రంజిత్ తో క‌లిసి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల మైదానంలో ప్ర‌తీ రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్క‌డి పిల్ల‌ల్లో కూడా చాలా మందిలో ప్ర‌తిభ ఉంది . త‌గిన ప్రోత్సాహం ఉంటే వారు కూడా రాణించే అవ‌కాశ‌ముంది.

దేశానికి ప్రాతినిధ్యం వ‌హించే అవ‌కాశం ఎలా వ‌చ్చింది.?

నేను అప్ప‌టికే రాష్ట్ర‌స్థాయిలో అటాక‌ర్ ఛేజ‌ర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను.రీసెంట్ గా జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం రాష్ట్ర స్థాయిలో రాణించిన వివిధ రాష్ట్రాల‌కు చెందిన 60 మంది పురుషులు మ‌హిళ‌లను ప్రాబ‌బుల్స్ గా ఎంపిక చేసి 2024 డిసెంబ‌ర్ లో శిక్ష‌ణా శిబిరంలో ఆట‌లో త‌ర్ఫీదు నిచ్చారు. శిక్ష‌ణ స‌మ‌యంలో మంచి ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్ననేను అలా జాతీయ జ‌ట్టులో స్థానం సంపాదించాను.రెండు తెలుగు రాష్ట్రాల‌నుండి నేను ఒక్క‌డినే భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాను.తొలి సెల‌క్ష‌న్ లో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డం చాలా సంతోషాన్నించింది.

వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన జ‌ట్టులో స‌భ్యునిగా గుర్తింపు వ‌చ్చిందా..?

ప్ర‌ధాని మోదీతో అప్పాయింట్ మెంట్ ఉంటుంద‌న్నారు. కాని వీలు ప‌డ‌లేదు. త్వ‌ర‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీయం చంద్ర‌బాబు తో అప్పాయింట్మెంట్ ఉండే అవకాశ‌ముంది. జ‌ట్టులో నాతో పాటు ఆడిన మ‌హారాష్ట్ర ఆట‌గాళ్ల‌కు అక్క‌డి ప్ర‌భుత్వం న‌గ‌దు న‌జ‌రానాతో పాటు గ్రూప్ -1 పోస్టింగ్ కు హామీ ఇచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు ఇక్క‌డ ఏమీ అందుకోలేదు.

ఖోఖో కి క్రేజ్ ఉందా.?

గతంతో పోలిస్తే ఇప్పుడిప్పుడే కబడ్డీ, ఖోఖో క్రీడల పట్ల ఆదరణ పెరుగుతోంది. అంత‌ర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్ర‌భుత్వాలు త‌గిన విధంగా ప్రోత్సాహం ఇస్తే ఇంకా అద్భుతంగా ఆడే అవ‌కాశ‌ముంటుంటుంది. మ‌రెంతో మంది వెలుగులోకి వ‌స్తారు.

ఒక అంత‌ర్జాతీయ క్రీడాకారుడిగా ఆట‌గాళ్ల‌కు ఎలాంటి సందేశ‌మిస్తారు.

క్రీడలు కేవ‌లం మాన‌సికోల్లాసం కోసం మాత్ర‌మే కాదు.ఏకాగ్ర‌త ప‌ట్టుద‌ల‌గా శ్ర‌మిస్తే క్రీడ‌ల వ‌ల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. స్పోర్ట్స్ కోటాలో ప్ర‌త్యేక‌ రిజర్వేషన్ కేటాయించారు. చిన్ననాటి నుంచే పిల్లలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తే రాణించే అవ‌కాశం ఉంటుంది.శిక్ష‌ణ‌తో పాటు గ్రౌండ్ లో దిగితేనే ఆట‌గాళ్ల‌లో ఉన్నా స‌త్తా బ‌య‌ట‌ప‌డుతుంది.త‌గిన పోటీలు నిర్వ‌హించాలి. అప్పుడే వారిలో దాగి ఉన్న టాలెంట్ బ‌య‌టికోస్తుంది.

మీ అల్టిమేట్ గోల్ ఏంటి.?

ఖోఖోను ఒలిపింక్స్ లో చేర్చాల‌న్న ప్ర‌తిపాద‌న‌లు న‌డుస్తున్నాయి.బ‌హుషా 2036 లో ఇది సాధ్య‌ప‌డ‌వ‌చ్చు. ఇందుకోసం కృషి జ‌రుగుతోంది. ఒక వేళ అది సాధ్య‌మైతే ఒలింపిక్స్ క్రీడ‌ల్లో భార‌త దేశం త‌ర‌పున ఆడాల‌న్న‌ది నా గోల్.