సొరంగంలోనే ప్రాణాలు
ప్రమాద స్థలంలో పరిస్థితి తీవ్రం
ఎనిమిది మందిని కాపాడడం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న సర్కార్
స్వయంగా సొరంంలోకి వెళ్ళి మంత్రి జూపల్లి సాహసప్రయత్నం
టన్నెల్‌లోనే దాదాపు ఐదు గంటలు పాటు జూపల్లి కృష్ణారావు
ముఖ్యమంత్రి రేవంత్ కు రాహుల్ గాంధీ ఫోన్..
చిక్కకున్న వారి ప్రాణాలను కాపాడేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేయాలని సూచన
టన్నెల్ వద్దే మంత్రులు ఉత్తమ్, జూపల్లి
పరిస్థితిని ఎప్పటికపుడు తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సమస్య అంతా వందమీటర్లలోపే.. బురద అధికంగా ఉండడం వల్లే సమస్య
ఘటన తీవ్రత చాలా ఎక్కువగా ఉంది- మంత్రి జూపల్లి
హైదరాబాద్, నాగర్ కర్నూల్, మహా
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి పరిస్థితి ఆశాజనకంగా లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎనిమిది కుటుంబాల్లో గత రెండురోజులుగా తీవ్రమైన ఆందోళన నెలకొనగా, రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించలేదు. పరిస్థితిని స్వయంగా అంచనా వేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు నేరుగా టన్నెల్‌లోకి వెళ్ళి దాదాపు 5 గంటల పాటు సహాయక చర్యలను పర్యవేక్షించారు. లోపల నీరు. బురద అధికంగా ఉండండతో సహాయచర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో రాష్ట్ర చరిత్రలో పెనువిషాద సంఘటనగా ఇది నమోదయ్యే అవకాశం కనబడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయచర్యలను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని సూచించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదలశాఖ అధికారులు, ఆర్మీ, డిఆర్ఎష్ టీమ్స్ టన్నెల్ వద్దే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎస్ ఎల్ బీసీ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సహాయక చర్యలను దగ్గరుండీ పర్యవేక్షిస్తున్న మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి పలుమార్లు మాట్లాడారు. ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ నేవీ కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఏజెన్సీలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగించాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. వాటర్ ప్లోటింగ్ సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని, నిరంతరం నీటిని బయటకు తోడేయటంతో పాటు సొరంగంలోనికి ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. టన్నెల్ లో కూలిన మట్టి దిబ్బలను తొలగించి ప్రమాదం జరిగిన చోటికి చేరుకునే ప్రత్నామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఎనిమిది మందిని కాపాడడం కోసం సర్వశక్తులు- మంత్రి ఉత్తమ్
ఎనిమిది మందిని కాపాడడం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నామని నీటపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సంఘటనా స్థలిలో పరిస్థితి గంబీరంగా మారింది. ఈ తరహా సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు భారత సైన్యం సాహసోపేతంగా రెస్క్యూ చర్యలు తీసుకుంటుందని, ఎన్.డి.ఆర్.ఎఫ్,ఎస్.డి.ఆర్.ఎఫ్ బలగాలను రంగంలోకి దింపామని, ఇంజినీరింగ్ అధికారులతో పాటు సహాయక చర్యలు చేపట్టిన వారితో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నామన్నారు. సంఘటన జరిగిన మరుక్షణం నుండి సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైందని, ప్రధాని మోడీ,ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారన్నారు. టన్నెల్ ప్రమాద ఘటనను చిల్లర రాజకీయాలు చేయవద్దన్నారు. పదేళ్ల పాటు ప్రాజెక్టు పెండింగ్ లో పెట్టి ఇప్పుడు విమర్శలా అంటూ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఎస్.ఎల్.బి.సి ని బి.ఆర్.ఎస్ పాలకులు చేసిన నిర్లక్ష్యం కుడా ప్రమాదానికి కారణం అయి ఉండొచ్చని, ఏ టన్నెల్ నిర్మాణం జరిగినా లీకేజ్ లు సర్వసాధారణమన్నారు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో కుడా ఈ తరహా లీకేజ్ లు ఏర్పడ్డాయని, సొరంగం తవ్వకాల సమయంలో ఏర్పడ్డ లీకేజ్ ప్రమాదానికి కారణం అయి ఉండొచ్చన్నారు. టన్నెల్ ప్రమాద ఘటనలో బి.ఆర్.ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని, కమిషన్లు తప్ప ప్రాజెక్ట్ ల నిర్మాణాల గురించి పట్టించుకోని వారు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
పరిస్థితి తీవ్రం
ప్రమాద స్థలంలో పరిస్థితి తీవ్రంగా ఉందని, నీటి ప్రవాహం సహాయ చర్యలకు ఆటంకం కలిగిస్తుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. నీటి నిల్వలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, టన్నెల్ లోని మట్టి దిబ్బలను తొలగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నామని వివరించారు. టన్నెల్ లోని సహజ రాతి నిర్మాణాలు సడలడంతో అకస్మాత్తుగా నీరు, మట్టి ప్రవహించాయన్నారు. దాంతో టన్నెల్ లో 12-13 అడుగుల వరకు నీరు నిండిపోయిందన్నారు. ఇది అత్యంత క్లిష్టమైన పరిస్థితి, దీనిని పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణులు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు,” అని ఆయన వివరించారు. ప్రమాద ప్రాంతం భౌగోళికంగా క్లిష్టమైన ప్రదేశం కావడంతో భారీ యంత్రాలను అక్కడికి చేర్చడం కష్టంగా మారిందని తెలిపారు. అయినప్పటికీ, అధికారులు ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంభించి మట్టి దిబ్బేలు తొలగించేందుకు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ, విపత్తు నిర్వహణ బృందాలు, రక్షణ దళాలు సంయుక్తంగా సహాయ చర్యలు నిర్వహిస్తున్నాయని, నిరంతరం ఆక్సిజన్ పంపిణీ కొనసాగుతోందని, డీ వాటరింగ్ కోసం మోటార్లు వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు.
చివరివరకు ప్రయత్నాలు – మంత్రి జూపల్లి
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది పరిస్థితి ఆశాజనకంగా లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. అయితే చివరి వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఆదివారం దోమలపెంటలోని ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలను మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం దోమలపెంటలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. కార్మికుల ఆచూకీ లభ్యం కావడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. 8 మంది కార్మికుల రక్షణ కోసమే తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. టన్నెల్‌లోనే దాదాపు ఐదు గంటలు పాటు జూపల్లి కృష్ణారావు గడిపారు.







