Mahaa Daily Exclusive

  అమెరికా- భారత్ భాగస్వామ్యం వృద్ధే ట్రంప్‌ ఆకాంక్ష యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్..!

Share

అమెరికాతో పాటు భారత్‌ కూడా అభివృద్ధి చెందాలని ట్రంప్‌ కోరుకుంటున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తెలిపారు. అమెరికా, భారత్ భాగస్వామ్యం వృద్ధి చెందాలన్నదే ట్రంప్‌ ఆకాంక్ష అని చెప్పారు. భారత్ పర్యటనలో ఉన్న వాన్స్ రాజస్థాన్​ రాజధాని జైపుర్​లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. భారత శిల్పకళా నైపుణ్యం తనను అబ్బురపరిచిందన్నారు. భారత్‌ చరిత్ర, సంప్రదాయాలతో సుసంపన్నమైందని, భవిష్యత్తు పట్ల భారత్‌ దార్శనికత మెచ్చుకోదగినదని కొనియాడారు. అభివృద్ధి చెందేందుకు భారత్‌లో ఎన్నో అవకాశాలున్న జేడీ వాన్స్‌, భారతీయులమని ఇక్కడి వారు సగర్వంగా చెప్పుకుంటారన్నారు. ఏదో సాధించాలనే తపన భారతీయుల్లో అధికం అని చెప్పారు.

భారత్​ మా రక్షణ ఉత్పత్తులు కొనుగోలు చేయాలి

భారతదేశం తన మార్కెట్లలో అమెరికాకు యాక్సెస్​ ఇవ్వాలని వాన్స్​ పిలుపునిచ్చారు. అంతేకాకుండా అమెరికా ఇంధనం, రక్షణ హార్డ్​వేర్​లను కొనుగోలు చేయాలని చెప్పారు. అత్యాధునిక టెక్నాలజీ, రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాల్లో అమెరికా, భారత్​ కలిసి సాధించాల్సినవి చాలా ఉన్నాయన్నారు. 21వ శతాబ్దపు భవిష్యత్తును భారత్​, అమెరికాల బలం నిర్ణయిస్తుందని చెప్పారు. దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు న్యాయంగా ఉండాలన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్- భారత్​ వంటి స్నేహితులతో కలిసి మెరుగైన భవిష్యత్తును నిర్మించుకునేలా ప్రపంచ వాణిజ్యాన్ని తిరిగి సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడిన జేడీ వాన్స్​- మోదీ పొందిన అప్రూవల్​ రేటింగ్స్​ వల్ల తనకు అసూయ కలిగిందని గత రాత్రి ఆయనతో చెప్పినట్లు వెల్లడించారు