Mahaa Daily Exclusive

  జార్ఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి తెలంగాణ పర్యటన హైదరాబాద్‌లో మంత్రి తుమ్మలతోమర్యాద పూర్వక భేటీ…!

Share

జార్ఖండ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీమతి శిల్పి నేహా తెర్కే ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర రావు ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ భేటీలో రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్ధి, సమగ్ర సాగు విధానాలు, పంట విభజన, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అనేక అంశాలపై చర్చ జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య వ్యవసాయ రంగంలో అనుభవాలను పంచుకోవాలని, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని వారు నిర్ణయించారు.
శిల్పి నేహా తెర్కే గారు ఈ నెల 30వ తేదీ వరకు తెలంగాణలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా నేషనల్ మిలెట్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ , ఫిష్ ఫార్మింగ్ కేంద్రం, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు , ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిలెట్స్ రీసెర్చ్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను సందర్శించనున్నారు. ఈ సంస్థలచే చేపడుతున్న పరిశోధనలపై అవగాహన సాదించనున్న ఆమె, ఆయా రంగాల్లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను తమ రాష్ట్రంలో కూడా అందుబాటులోకి తేనున్న దిశగా చర్చలు జరపనున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు ఐఏఎస్ , ఉద్యానవన శాఖ డైరెక్టర్ యాస్మిన్ పాషా ఐఏఎస్ తదితర అధికారులు కూడా పాల్గొన్నారు.
విభిన్న శాఖల అధికారులు తమ అనుభవాలను షేర్ చేస్తూ, వ్యవసాయ రంగ బలోపేతానికి అవసరమైన అంశాలను వివరించారు.
ఈ పర్యటన ద్వారా జార్ఖండ్–తెలంగాణ వ్యవసాయ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని, రాష్ట్రాల అభివృద్ధికి ఇది సహాయపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.