ఈనెల 30న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవం ఘనంగా జరగనుంది. ఉత్సవ ఏర్పాట్లను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రికి ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. పండితులు వేదాశీర్వచనాలు అందించారు.ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, వారి సౌకర్యాల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని, పెద్ద సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గతంలో ఎన్నడు లేనివిధంగా ఐదుగురు మంత్రులతో కూడిన బృందం సమీక్షించారన్నారు.
అంతరాలయ దర్శనాలు ఉదయం ఆరు గంటలకు ముగిసేలా ఏర్పాట్లు చేశామన్నారు.
ఇటీవల ఎన్డీయే ప్రభుత్వ అధ్వర్యంలో జరిగిన అనేక ఆలయ ఉత్సవాల విజయవంతం నేపథ్యంలో ఈ ఉత్సవం పట్ల భక్తుల్లో విశ్వాసం పెరిగిందని, స్వామివారి నిజరూప దర్శనానికి సుమారు రెండు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని హోం మంత్రి అనిత తెలిపారు








