భద్రాచలం పట్టణంలోని సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కి మంగళవారం వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి మాట్లాడుతూ, పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ వద్ద నిర్మిస్తున్న కరకట్ట పనులు నత్తనడకన సాగుతుండడంతో రానున్న వర్షాకాలం వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కరకట్ట పునర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. పట్టణ వ్యాప్తంగా అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కారణంగా నివాస ప్రాంతాలలో మురుగునీరు చేరి దోమలు వ్యాప్తి చెండుతున్నాయని, వెంటనే డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని కోరారు. భద్రాచలం కేంద్రంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించినప్పటికీ నేటికి భద్రాచలంలో ఇందిరమ్మ లబ్ధిదారుల వివరాలు అధికారులు బయటికి చెప్పడం లేదని ఇందిరమ్మ లబ్ధిదారుల లిస్టుల పేర్లతో గందరగోళాలను సృష్టిస్తున్నారని కలెక్టర్ జోక్యం చేసుకొని అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేయాలని కోరారు. సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి అతి సమీపంలో చెత్త వేయటంతో పాటు సాయంత్రం పూట దాన్ని తగలబెట్టడంతో పొగ వ్యాపించి రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని
వెంటనే డంపింగ్ యార్డ్ ను అక్కడి నుండి తరలించాలని కోరారు. స్పందించిన జిల్లా కలెక్టర్ వీలైనంత త్వరగా భద్రాచలం సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు సున్నం గంగా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రం శెట్టి వెంకట రామారావు పారేల్లి సంతోష్ కుమార్ డి సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.








