Mahaa Daily Exclusive

  నాలుగు కోట్ల 18 లక్షల తో నిర్మించిన మూడు హైలెవల్ బ్రిడ్జిలను ప్రారంభించిన మంత్రి తుమ్మల…!

Share

అడవిని నమ్ముకుని జీవించే కొండ రెడ్ల గిరిజన కుటుంబాలకు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా నెలకు ఒకసారి ఆ గ్రామాలను సందర్శించి వారి జీవన వైవిధ్య సమస్యలను తెలుసుకొని జిల్లా కలెక్టర్ , ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకొని వెళ్లి గిరిజనులను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి ,మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
మండలం లోని పూసుకుంట ,కటుకూరు గిరిజన గ్రామాలలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తో కలిసి మంగళవారం మంత్రి తుమ్మల పర్యటించారు.నాలుగు కోట్ల 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కల్వర్టులను ఆయన ప్రారంభించారు. అనంతరం పూసుకుంట గ్రామములో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు .మారుమూల ప్రాంతాలలో నివసించే కొండరేడ్ల గిరిజన గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక విద్యా వైద్యం ,మౌలిక వసతుల కల్పనకు ఇబ్బందులు పడుతుండేవారని, వారి సమస్యలను దృష్టిలో పెట్టుకొని గత జనవరి మాసంలో ఫారెస్ట్ వారి అనుమతి తీసుకొని కల్వర్టుల నిర్మాణం కొరకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని తెలిపారు. నేడు ఆ కలవర్టులను ప్రారంభించి వర్షాకాలంలో ఈ గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసామని, అలాగే బీటీ రోడ్డు పనులను కూడా త్వరగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఈ గ్రామాలకు కరెంటు సౌకర్యం , రోడ్డు నిర్మాణం చేపట్టడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏమైనా అడ్డంకులు సృష్టిస్తే సంబంధిత ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయి సమస్య పరిష్కరించుకోవాలని అన్నారు.

అడవిని నమ్ముకొని జీవించే కొండరెడ్ల గిరిజనులు అటవీ ఫలాలు అమ్ముకొని జీవనోపాధి పెంపొందించుకోవడం వారి హక్కు అని వారిని అటవీశాఖ అధికారులు ఎటువంటి ఇబ్బందులకు గురి చేయొథ్దన్నారు. కొండరెడ్ల కుటుంబాల జీవనస్థితిగతులను అధ్యయనం చేసుకొని అధికారులు నిబద్ధతగా పనిచేయాలని, ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాలన్నారు. పిల్లాపాపలతో సుఖమైన జీవితం గడపాలని, పిల్లలందరూ విద్యావంతులు అయ్యేలాగా చూడాలని, గిరిజన రైతులకు పామాయిల్ తోటల పెంపకం , హార్టికల్చర్ కు సంబంధించిన సలహాలు సూచనలు, వెదురు సాగు, రైతులు ఆదాయ వనరులు సమకూర్చుకునే సలహాలు ఇచ్చి వారు సంవత్సరానికి రెండు పంటలు పండించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ముందడుగులో ఉందని, మన జిల్లాలో కావలసిన వనరులు ఎన్నో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
కొండా కోనల్లో నివసించే ఆదిమ గిరిజనుల సంక్షేమాన్ని ముఖ్యంగా విద్యా వైద్యం మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారుల సమన్వయంతో అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నామని తెలిపారు.
పేద కుటుంబాలకు సన్న బియ్యం, గిరిజన నిరుద్యోగ యువకులకు రాజీవ్ యువ వికాస పథకం ప్రవేశ పెట్టడం జరిగిందని, చిన్నారులకు పౌష్టికారమైన ఆహారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇప్పించడం జరుగుతుందని, గర్భిణీ స్త్రీలకు బాలామృతం అందజేస్తున్నామని అన్నారు. గిరిజన కుటుంబాలు ఆరోగ్యపరంగా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, ఈ గ్రామానికి రహదారి సౌకర్యం ఏర్పడినందున ఈ గ్రామంలోని గిరిజనులు అత్యవసర చికిత్సల కోసం ఆసుపత్రికి వెళ్లడానికి రెండు అంబులెన్స్లను ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు తుమ్మల స్పష్టం చేశారు.

గిరిజన కుటుంబాలకు 5 లక్షల విలువ గల సామాగ్రి పంపిణీ :

కొండరెడ్ల గిరిజనులు జీవనోపాధి పెంపొందించుకొని కుటుంబాలను పోషించుకోవడానికి గత సమావేశంలో దరఖాస్తులు చేసుకున్న కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల విలువగల టెంట్ హౌస్, మైక్ సిస్టం , నారాయణమ్మ, యాట్ల కాంతారెడ్డి కుటుంబాలకు అందించారు.తేనెను సేకరించి అమ్ముకోవడానికి 45 వేల రూపాయల విలువగల తేనే తయారీ బాక్సులు ఐదుగురికి 9 బాక్సుల చొప్పున అందించి వారికి తేనె సేకరణ గురించి శిక్షణ ఇస్తారని , బ్యాంబో క్రాఫ్ట్ తయారీ శిక్షణ కు ఉత్సాహవంతులైన యువతీ యువకులకు ఐటీడీఏ ద్వారా అందించడం జరుగుతుందని అన్నారు. అలాగే డ్రైవింగ్ శిక్షణ తీసుకున్న కొండరెడ్ల యువకులకు సంబంధిత పోలీస్ అధికారులు ఆర్టీవో తో మాట్లాడి వారికి డ్రైవింగ్ లైసెన్సులు అందేలా చూడాలన్నారు.

కొత్తగూడెం లోని ఎర్త్ సైన్స్ యూనివర్శిటీ లో ప్రావీణ్యం పొందండి. :

భారతదేశంలో ఎక్కడా లభించని ఖనిజాలు కొత్తగూడెం జిల్లాలో దొరుకుతున్నాయని, గిరిజన యువతి యువకులు కొత్తగూడెంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ద్వారా మంచి ప్రావీణ్యం పొంది భూగర్భ జలాలలో ఉన్న ఖనిజాలను కనుగొనే విధంగా నైపుణ్యాన్ని పెంచుకొని వేరే దేశాలకు మన పేరు వ్యాప్తి చెందేలా చూడాలని గిరిజన యువకులను కోరారు.గిరిజన రైతులకు మేలు జరగాలంటే భూగర్భ జలాలు పెంపొందించుకుంటే మన భూములు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు.

మోడల్ రెసిడెన్షియల్ కళాశాల కు ఏర్పాట్లు :

అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చొరవతో 250 కోట్ల వ్యయంతో మోడల్ రెసిడెన్షియల్ కళాశాల నిర్మాణానికి సీఎం ఒప్పుకున్నందున 25 ఎకరాల ప్రభుత్వ భూమి అవసరం ఉందని ఆ భూమిని సేకరించి మోడల్ రెసిడెన్షియల్ కళాశాల శంకుస్థాపన త్వరలో ప్రారంభిస్తామని తుమ్మల హామీ ఇచ్చారు.

కొండరెడ్ల గిరిజనుల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం.

కొండరెడ్ల గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ , ఐటీడీఏ పీవో బి. రాహుల్ అన్నారు. కొండరెడ్ల కుటుంబాల సంక్షేమం కోసం పూసుకుంట గ్రామంలోని గిరిజన రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలు 12 మంది రైతులకు అందించామని, ఐటీడీఏ ద్వారా కరెంటు మరియు మోటార్లు పదిమందికి అందించి, పంటల రక్షణకు కంచె ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయిల్ ఫామ్ తోటలు పెరగగానే అంతర్ పంటలుగా కూరగాయల మొక్కలు, మునగ చెట్లు వేసుకునేలా సలహాలు సూచనలు అందించడం జరిగిందని, ఈ గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నడపబడుతున్న పాఠశాలలో ఇద్దరు టీచర్లను నియమించి గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని, రాజీవ్ యువ వికాస పథకానికి 19 మంది యువకులు దరఖాస్తులు చేసుకున్నారని, ఈ దరఖాస్తులు వ్యవసాయానికి సంబంధించి మరియు కిరాణా షాపులు, ఫ్యాన్సీ స్టోర్ లు కొరకు ఉన్నందున వారికి తప్పనిసరిగా అందే విధంగా చర్యలు తీసుకుంటామని, మహిళా సంఘాలకు తేనె పెంపకం శిక్షణ, వెదురుతో తయారు చేసే కళాఖండాల శిక్షణ అందిస్తామని, కొండరెడ్ల అభ్యున్నతికి ఐటీడీఏ తరఫున సహకారం అందించడానికి సంబంధిత అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని వారు అన్నారు.
అనంతరం టెంట్ హౌస్, సౌండ్ సిస్టం సామాగ్రి, తేనె సేకరించే బాక్సులను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు.
ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ శర్మ, ఎస్పీ రోహిత్ రాజ్, ఆర్డీవో మధుసూదన్, ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వరరావు, డిపిఓ చంద్రమౌళి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ తిరుమలరావు, ఎస్సీ ఎన్పీడీసీఎల్ రమేష్, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డిప్యూటీ డిఎంహెచ్వో రామలక్ష్మి, మిషన్ భగీరథ ఈ ఈ నళిని, పి ఆర్ డి ఈ చంద్రమౌళి, ఐటీడీఏ సహాయ ప్రాజెక్ట్ అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, పి వి టి జి అధికారి నరేష్, డిటిఆర్ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, ఎస్ ఓ ఉదయ భాస్కర్, జేడీఎం హరికృష్ణ మరియు ఇతర శాఖల అధికారులు సిబ్బంది ,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు