భద్రాద్రి కొత్తగూడెం, మే 1 (మహా):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెం గ్రామంలో 2020 ఫిబ్రవరి నెలలో జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులకు యావజీవ కారాగార శిక్ష విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిలు అయిన సోందే ముద్ద రాజు, సొందే రవి, మరియు మృతుడు కారం రామకృష్ణ మధ్య భూవివాద నేపథ్యంలో సోందే ముదిరాజు మరియు సోందే రవిలు మరొక ఐదుగురు నిందితులతో కలిసి కారం రామకృష్ణను చంపడానికి కుట్ర పన్ని, 2020 ఫిబ్రవరి 10 న రాత్రి సమయంలో కారం రామకృష్ణ తన ఇంట్లో భార్య పిల్లలతో నిద్రిస్తుండగా, కత్తులు, కర్రలతో వెళ్లి కారం రామకృష్ణను హత్య చేసి అడ్డు వెళ్లిన భార్యను తీవ్రంగా గాయపరచారు. మొత్తం 08 మంది నిందితులపై హత్యా నేరం మోపగా, విచారణ సమయంలో ఇద్దరు ముద్దాయిలు మరణించగా ఒక ముద్దాయిని నిర్దోషిగా విడుదల చేసారు. మిగిలిన ఐదుగురు ప్రధాన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష మరియు ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు జరిమానా విధిస్తూ ఈ రోజు తీర్పును వెలువరించారు. తీర్పు అనంతరం జిల్లా జడ్జి ఉత్తర్వుల మేరకు నిందితులను దుమ్ముగూడెం పోలీసులు అదుపులోకి తీసుకొని ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన విచారణ అధికారి అయిన ఇన్స్పెక్టర్ నల్లగట్ల వెంకటేశ్వర్లు,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అయిన రాధా కృష్ణ, పీవిడి లక్ష్మీ మరియు నోడల్ ఆఫీసర్ ఎస్సై ప్రవీణ్, లైజన్ ఆఫీసర్ వీరబాబు మరియు దుమ్ముగూడెం కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ తిరుపతిని ఈరోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.








