రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
హిట్లర్ పాసింజం, సామ్రాజ్యవాదాన్ని మట్టి కరిపించి రష్యాలో ఎర్రజెండా ఎగిరేసిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. ప్రపంచ దేశాలను ఆక్రమించుకోవాలన్నా కుట్రగా జరిగిన హిట్లర్ దూకుడుకు ఎర్రజెండా అడ్డుకట్ట వేసిందన్నారు. రష్యాలో అడుగు పెట్టకుండా సోవియట్ యూనియన్ ఎర్రసైన్యం అడ్డుకొని కమ్యూనిస్టు నాయకత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చాయని గుర్తు చేశారు. హిట్లర్ పాసింజంపై నాటి సోవియట్ యూనియన్ ఎర్రసైన్యం విజయం సాధించి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని పాషా, నరహరి స్మారక కేంద్రంలో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. నియంత హిట్లర్ ప్రపంచంలోనే ఒక్కొక్క దేశాన్ని ఆక్రమించుకుంటూ రష్యాను కూడా ఆక్రమించుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని 1945లో సోవియట్ యూనియన్, కమ్యూనిస్టు పార్టీల ఎర్రసైన్యం అడ్డుకట్ట వేశాయన్నారు. హిట్లర్ ను ఓడిరచిందన్నారు. ఈ తరుణంలో ఫాసిజం, సామ్రాజ్యవాద ధోరణులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, ప్రజలు సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులు, పాలకవర్గాలు హిట్లర్ నాజీయిజాన్ని పెంచి పోషించాయని తెలిపారు. కమ్యూనిజాన్ని లేకుండా చేస్తాడని ఆయనను ప్రోత్సహించి రష్యా, సోవియట్ యూనియన్ మీద దాడి చేయించడానికి పూనుకున్నాయన్నారు. హిట్లర్ పాసిజానికి వ్యతిరేకంగా రష్యాలో స్టాలిన్ నాయకత్వాన 2 కోట్ల మంది సోవియట్ యూనియన్ ప్రజలు, సైన్యం తిరుగుబాటు చేసి ప్రాణాలర్పించారన్నారు. ఈ పోరాటంలో 30 లక్షల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రాణాలు బలి ఇచ్చారన్నారు. 20 లక్షల మంది యూదులను ఊచకోత కోశారని తెలిపారు. అయినా రష్యా ప్రజలు పోరాట శక్తిని ప్రదర్శిస్తూ హిట్లర్ ఫాసిజాన్ని ఓడించి జర్మనీలోని బెర్లిన్ నగరానికి హిట్లర్‌ను తరిమికొట్టి అక్కడ ఎర్రజెండా ఎగురవేశారని వివరించారు. ప్రపంచంలోని సంపద, వనరులను కాజేయాలన్న హిట్లర్ కుట్రలను రష్యా ప్రజలకు అడ్డుకట్ట వేశారన్నారు. ఎర్రజెండాను కనుమరుగు చేయాలనుకోవడం పాలకపక్షాలు, నియంతృత్వ శక్తులతరం కాదన్నారు. ఈ తరుణంలో 8 గంటల పని విధానం కోసం ఎర్రజెండా నాయకత్వంలో ప్రజలు కొట్లాడి సాధించుకున్న హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. మళ్ళీ 12 గంటల పని విధానాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. సంఘాలు, సమ్మె హక్కులు లేకుండా చేస్తున్నారన్నారు. రైతుకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతు ఆత్మహత్యలు పెరిగాయని ఆందోళన వెలిబుచ్చారు. ఉపాధి కూలీలకు 200 రోజులు పని కల్పించాలని ఉద్యమాలు కొనసాగుతుంటే పని గంటలు తగ్గించడం మోడీ ప్రభుత్వ నియంతృత విధానాలకు నిదర్శనన్నారు. నిరుద్యోగం పెరుగుతోందని, విద్యా, వైద్యం అందడం లేదన్నారు. మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు అమలు కావడం లేదన్నారు. ప్రపంచాన్నే గడగడలాడించిన హిట్లర్నే ఓడించిన శ్రామిక వర్గం, ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత విధానాలను సైతం ఓడిస్తారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర అప్పులతో దివాలా తీసిందని చెప్తున్నా ముఖ్యమంత్రికి ఎన్నికల ముందు తెలియదా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని దేవుళ్ళపై ఓట్లేసి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ వాగ్దామాలను అమలు చేయకపోతే తగిన గుణపాఠం రాష్ట్ర ప్రజలు చెప్పక తప్పదన్నారు. ఉగ్రవాద చర్యలను సీపీఐ(ఎం) ఖండిస్తుందన్నారు. ఈ తరుణంలో భారత్, పాకిస్తాన్ కు మధ్య యుద్ధం కొనసాగుతుండగా ఆర్థిక సంక్షోభ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ తరుణంలో ప్రపంచ దేశాలు సమైక్యంగా ఉగ్రవాదాన్ని అనుచివేసి శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేయాలని సూచించారు.
అందాల పోటీలు అవసరమా..
ఓవైపు భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతుండగా హైదరాబాదులో అందాల పోటీలు నిర్వహించడం సరికాదని జాన్ వెస్లీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను దేశ ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి కల్పించొద్దని ప్రభుత్వానికి సూచించారు. వెంటనే హైదరాబాద్ లో జరగాల్సిన అందాల పోటీలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ(ఎం) మద్దతు..
ఈ నెల 20న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని జాన్ వెస్లీ తెలిపారు. అదే విధంగా ఈనెల 30న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు వ్యవసాయ కార్మిక సంఘం చేపట్టే ధర్నాలకు సైతం మద్దతు ప్రకటిస్తుందన్నారు. రైతులు, కూలీలు, వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్గం ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాన్ని, ప్రజలను చైతన్యం చేస్తూ, శ్రామికవర్గ పోరాటాలను ముందుకుతీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్, సామెల్, జగదీష్, ఈ నర్సింహ, జగన్, చంద్రమోహన్, జిల్లా కమిటీ సభ్యులు ఆలంపల్లి నర్సింహ, శ్యామ్ సుందర్, కీసర సర్సిరెడ్డి, కిషన్, గోరెంకాల నర్సింహా, పి జగన్, సుమలత, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యదర్శి ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.








