ఢిల్లీ: అవసరమైతే అత్యవసర అధికారులు ఉపయోగించుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం హోం శాఖ లేఖలు రాసింది. 1968 సివిల్ డిఫెన్స్ చట్టంలోని రూల్ 11 వినియోగించుకోవాలని లేఖలో పేర్కొంది. అయితే రూల్ 11 ప్రకారం సైరన్ వంటి అత్యవసర పరికరాలు కొనేందుకు పూర్తి అధికారం ఇస్తున్నట్లు ప్రకటించింది. భారత్లోని సరిహద్దు నగరాల్లో పాకిస్తాన్ దాడి చేస్తుందనే ముందస్తు సమాచారంతో ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో ప్రజలను అలర్ట్ చేయడానికి సైరన్లను భారత సైన్యం ఉపయోగిస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్గా ఉండి పౌరుల భద్రతకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉండాలని సూచనలు చేసింది.
ఈ చట్టం ఉద్దేశం..
1968లో భారత పార్లమెంట్ ఆమోదించిన పౌర రక్షణ చట్టం శత్రు దాడులు లేదా విపత్తుల నుండి పౌరులు, ఆస్తులు, భారత భూభాగాన్ని రక్షించడానికి అవసరమైన చర్యలను నిర్వహించడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ చట్టాన్ని మే 24, 1968 న ఆమోదించారు. యుద్ధం, బాహ్య దాడి, అంతర్గత అశాంతి, ఇతర శత్రు దాడుల నుండి పౌరులు, ఆస్తులు, భారత భూభాగాన్ని రక్షించడం ఈ చట్టం ఉద్దేశం. సంక్షోభాల సమయంలో విద్యుత్, నీటి సరఫరా, రవాణాతో సహా ముఖ్యమైన సేవలు నిరంతరాయంగా పనిచేస్తాయని కూడా ఇది నిర్ధారిస్తుంది.








