Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ సర్కార్‌ను వదిలిపెట్టం హామీలు అమలు కోసం నిరంతరం పట్టుబడుతాం ఖమ్మంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు ..!

Share

ఖమ్మం, మహా: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు విని రాష్ట్ర ప్రజలంతా మోసపోయారని, ఇప్పుడిప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఐదేళ్లు దీని ఫలితం అనుభవించాల్సిందేనని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని మిట్టపల్లిలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరి కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన హామీలు అమలు కోసం నిరంతరం పట్టుబడుతామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి దివాళాకోరు ముఖ్యమంత్రి అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఢిల్లీ వెళ్తే దొంగల్లా చూస్తున్నారన్న రేవంత్‌ను.. దొంగను దొంగలా చూడకపోతే ఎలా చూస్తారని విమర్శించారు. గుడిలో చెప్పులు ఎత్తుకుపోయేవారిలా చూస్తున్నారనడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే ఐదేళ్లు శిక్ష అనుభవించక తప్పదంటూ పేర్కొన్నారు. ఉన్న పథకాలను ఎత్తి వేస్తున్న ప్రభుత్వం కొత్త స్కీంలను ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్, రైతుబంధు, రుణమాఫీ, పెన్షన్ పెంపు ఇలా ఎన్నో పథకాలు ఆగిపోయాయని విమర్శించారు.
ఏం మార్పు జరిగింది..
మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అధికారమిస్తే ప్రజల్లో ఎలాంటి మార్పు వచ్చిందో గమనించాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు కడితే ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సీతారామ నీళ్లు నెత్తిన చల్లుకున్నారే తప్ప.. చుక్క నీరివ్వలేదని ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా చేసింది శూన్యమని, జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటని కేటీఆర్ విమర్శించారు. పాలేరులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా భారీ మెజార్టీతో కందాళ ఉపేందర్ రెడ్డి గెలువడం ఖాయమని అన్నారు. భద్రాచలంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, మధ్యంతర ఎన్నికలకు జిల్లాలోని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని సూచించారు. లింగాల కమల్ రాజ్‌ను ఓడించేందుకు భట్టి విక్రమార్క ప్రజలకు తప్పుడు హామీలిచ్చారని, బాండ్ పేపర్లు రాసి దేవుని గుడిలో పెట్టి ఎన్నికల్లో గెలిచిన భట్టి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని, అందుకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు గులాబీ పార్టీనే అండగా ఉంటుందని స్పష్టం చేశారు.