Mahaa Daily Exclusive

  నేటి నుంచే.. సుందరీమణుల సందడి మిస్ వరల్డ్ పోటీలకు ఏర్పాట్లు పూర్తి =గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ..!

Share

హైదరాబాద్, మహా: మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడింది. నేడు సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు అధికారికంగా ప్రారంభమవుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే ఎయిర్ పోర్టుతో సహా హైదరాబాద్ నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది. ఇక శుక్రవారం వరకు 110 దేశాలకు చెందిన పోటీదారులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రారంభోత్సవంలో 2500 మంది పాల్గొననున్నారు. అందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పాకిస్తాన్‌తో వార్ దృష్ట్యా స్టేడియంతో పాటు రాజధాని, పోటీదారులు సందర్శించనున్న 22 టూరిజం ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీలను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో తొలిసారి మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. దీంతో తెలంగాణ టూరిజంను ప్రమోట్ చేసేందుకు వేదికగా ఈ పోటీలను వినియోగించుకోవాలని, అందుకు అనుగుణంగా ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఈ పోటీల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా స్వాగత ఏర్పాట్లు చేశారు. పోటీదారులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన వెంటనే డప్పు వాయిద్యాలు, నృత్య ప్రదర్శన, కుంకుమ తిలకం దిద్ది స్వాగతించారు. వారికి ట్రిడెంట్ హోటల్‌లో వసతి ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 110 దేశాల నుంచి పోటీదారులు హాజరయ్యారు. వారందరికీ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించింది. గురు, శుక్రవారాల్లో పోటీదారులు రిహార్సల్స్ నిర్వహించారు.

భద్రత కట్టుదిట్టం
స్టేడియం వద్ద మూడంచెల భద్రతను ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. పాకిస్థాన్‌తో యుద్ధం జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని పోటీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. చిన్న సంఘటన జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. నిత్యం మానిటరింగ్ చేస్తుంది. అందులో భాగంగానే విమానాశ్రయం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వారికి, వారు ఉంటున్న హోటల్ వద్ద కూడా భద్రతను పెంచింది.

2500 మంది ప్రతినిధులకు పాసులు
ఈ ప్రారంభ కార్యక్రమానికి 2500 మంది ప్రతినిధులకు పాసులు ఇచ్చారు. సీఎం, మంత్రులతో పాటు 800 మంది వీఐపీలు, 300 మంది వరకు కంటెస్టులు, వారితో వచ్చిన వారు ఉండగా మిగిలినవారు మీడియా ప్రతినిధులు, కొంతమంది సామాన్య ప్రజలకు సైతం పాసులు జారీ చేశారు. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 5.30 గంటల నుంచి స్టేడియం గేట్లు ఓపెన్ చేసి అతిధులకు ఎంట్రీ సదుపాయం కల్పిస్తారు. వీఐపీలకు 6.15 గంటలకు, 6.30 గంటలకు ప్రారంభ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్‌తో తెలంగాణ ప్రభుత్వం, పోటీల నిర్వాహకులు, ఏయే దేశాల నుంచి పోటీదారుల గురించి వీడియో ప్రదర్శన చేయనున్నారు. సాయంత్రం 6.33గంటలకు సింగర్స్ రాష్ట్ర గీతం పాడనున్నారు. 6.36 గంటలకు 250 మందితో ప్రేరిణి నృత్య ప్రదర్శన ఉంటుంది. 6.45 గంటలకు తెలంగాణ టూరిజంపై వివరించనున్నారు. 6.47 గంటలకు కొమ్ముకోయ నృత్య ప్రదర్శన, 7.06 గంటలకు గుస్సాడి నృత్యం, 7.27 గంటలకు లంబాడీ డ్యాన్స్, 7.45 గంటలకు ఒగ్గుడోలు నృత్య ప్రదర్శన, 8.04 గంటలకు మిస్ వరల్డ్ కంటెస్టుదారుల వాక్, 8.06 ఇండియా ఫ్లాగ్, 8.12 గంటలకు జాతీయ గీతం, 8.17 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పోటీలను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత పోటీలను నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్పర్సన్, సీఈవో జూలియా ఈవెలిన్ మోర్లీ సైతం ప్రసంగించనున్నారు. 8.24 గంటలకు కార్యక్రమం ముగియనున్నది.