Mahaa Daily Exclusive

  వీరుడా.. వందనం కశ్మీర్ బోర్డర్​లో ఏపీ జవాన్ వీరమరణం పాక్ కాల్పుల్లో మృతి చెందిన మురళి నాయక్..!

Share

మహా: శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లితండాకు చెందిన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ (24) వీరమరణం చెందారు. శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలకు మురళి నాయక్ ఒక్కరే సంతానం. జవాన్ మురళీ నాయక్ మృతితో, కల్లితండాలో అతని ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో విషాదఛాయలు అలుముకున్నాయి. మురళీ నాయక్ 2022 అక్టోబర్​లో మొదటిసారి అగ్నివీర్​కు సెలెక్ట్ అయ్యారు. మహారాష్ట్రలోని నాసిక్​లో విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ బార్డర్​లో విధులు నిర్వహిస్తుండగా, గురువారం రాత్రి చొరబాటుదారులను అడ్డుకునే క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మురళీ నాయక్ ఐదుగురు చొరబాటుదారులను హతమార్చారు. అక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో మురళీ నాయక్ వీరమరణం పొందారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం..
దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయక్​కు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మురళీనాయక్ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి సీఎం వారిని పరామర్శించారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళీ త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ మురళి నాయక్ వీర మరణం పొందడం దిగ్భ్రాంతి కలిగించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జవాన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.