ఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ఇండియాకు వచ్చారు. ఇండియా, ఇరాన్ స్నేహ సంబంధాలు మొదలై 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన భారత్‌కు విచ్చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న 20వ ఇండియా, ఇరాన్ జాయింట్ కమిషన్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ.. అరాగ్చీకి సాదర స్వాగతం పలికింది. ఈ నేపథ్యంలోనే జై శంకర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో ‘ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీకి సాదర స్వాగతం. ఆయన ఢిల్లీలో జరుగుతున్న ఇండియా, ఇరాన్ జాయింట్ కమిషన్ మీటింగ్‌లో పాల్గొనడానికి వచ్చారు. ఇండియా, ఇరాన్ స్నేహ సంబంధాలు మొదలై 75 సంవత్సరాలు అవుతోంది. రెండు దేశాల మధ్య సంబంధాలను రివ్యూ చేసుకుని, మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తాం’ అని వెల్లడించారు. పలు కీలక విషయాలపై రెండు దేశాల మంత్రులు చర్చించే అవకాశం ఉంది. ట్రేడ్, ఎనర్జీ, కనెక్టివిటీతో పాటు రీజనల్ కోఆపరేషన్‌పై చర్చ జరగనుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ తమదే అని దానిని తిరిగి పొందుతామని గత కొంత కాలంగా మన ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో దీనిపై కూడా చర్చించారని సమాచారం. ఇరాన్ పోర్టును ఆనుకొని బలుచిస్తాన్ ఉంటుంది. అందుకే రెండు వైపులా నుంచి పాక్‌పై ఒత్తిడి తెచ్చే వ్యూహంలా కనిపిస్తున్నది. పాకిస్తాన్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇండియా చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.








