Mahaa Daily Exclusive

  బంగారు తెలంగాణ ఎక్కడ? కేసీఆర్ కుటుంబం మాత్రమే అయ్యింది గత పదేళ్లలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ధ్వజం..!

Share

మహా: తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రెండు పార్టీలు తెలంగాణ నిధులను దుర్వినియోగం చేశాయని మండిపడ్డారు. కేసీఆర్ నీళ్ల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని అన్నారు. నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర‌నేత సోనియా గాంధీని తెలంగాణ దెయ్యం అన్నార‌ని, ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగానే దేవత అంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమం ప్రపంచ చరిత్రలో అహింసాయుతంగా సాగిన ప్రబలమైన పోరాటంగా గుర్తించదగ్గదన్నారు. స్వరాష్ట్రం కోసం 1200 మందికిపైగా యువతులు, విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారని, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఢిల్లీ పార్లమెంట్ వరకు ఆందోళనలు కొనసాగినట్లు గుర్తు చేశారు. అన్ని పార్టీల కన్నా ముందుగా బీజేపీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, జేఏసీలో చేరిన ఏకైక పార్టీ అని పేర్కొన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీ పోరాడిందని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం దేశ పార్లమెంట్‌లో గళమెత్తిందని తెలిపారు.
అభివృద్ధి చేస్తాం ఒట్టేసి..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని, ప్రజలకు మాత్రం ఆశించిన ఫలితాలు లభించలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలు నీటి ప్రాజెక్టుల పేరిట దుర్వినియోగమయ్యాయని మండిపడ్డారు. ఉద్యమ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసుల రబ్బరు బుల్లెట్లు, లాఠీలతో విరుచుకుపడితే దేశ వ్యాప్తంగా బీజేపీ ఎంపీలు తెలంగాణ యువతకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 ఏళ్ల తర్వాత ప్రజలు, మేధావులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పున:నిర్మించాలంటే బీజేపీనే ప్రత్యామ్నాయమని, ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నీతి, నిజాయితీతో అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా, అభివృద్ధి చేస్తాం ఒట్టేసి చెబుతూ తెలంగాణ రాష్ట్రాన్ని నీతి, నిజాయితీతో, అంకితభావంతో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలన, బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల దోపిడీ పాలనకు తెరదించాలని, తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణకు సపోర్ట్ చేశారన్నారు. సుష్మా స్వరాజ్ తెలంగాణ బిడ్డలారా చనిపోకండి మీకు అండగా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చార‌ని గుర్తు చేశారు.. ఇంకా రాజకీయం చేయొద్దు పిల్లలు చనిపోతున్నారు బిల్లు పెట్టండి అని చెప్పింది బీజేపీనే అని అన్నారు. ఈ నీళ్ళు, నిధులు, నియామకాల కోసం యువకులు పోరాటం చేశార‌ని అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతృత్వంలో తిరోగమన దిశలో తెలంగాణ పోతుంద‌న్నారు. తెలంగాణ తన గొప్పతనం చాటి చెప్పాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు.