మహా: తెలంగాణలో కన్ఫ్యూజ్ పొలిటీషన్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం హైదరాబాద్ గాంధీ భవన్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ వదిలి పెట్టానని ఈటల రాజేందర్ చెబుతున్నారని గుర్తు చేశారు. కానీ ఆయన 24 గంటలు బీఆర్ఎస్ గురించే మాట్లాడుతున్నారని చెప్పారు. ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్న విషయం ఆ పార్టీ నాయకులే గుర్తించడం లేదని ఎద్దేవా చేశారు. ఏ పదవి రాకపోవడంతో.. తమ పార్టీ నేతలపై ఈటల రాజేందర్ ప్రస్టేషన్తో మాట్లాడుతున్నారన్నారు. తమ పార్టీ నేతలను విమర్శించవద్దని ఈ సందర్భంగా ఈటలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్యూఐ నుంచి పీసీసీ అధ్యక్షుడి అయ్యారన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది.. బీఆర్ఎస్ పార్టీ అని మాజీ మంత్రి హరీశ్ రావు అంటున్నారని.. కానీ తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. నాడు సోనియాగాంధీ ఈ రాష్ట్రం ఇవ్వబట్టే నేడు ఆవిర్భావ సభలు జరుగుతున్నాయని వివరించారు. ఇంగ్లాండ్ మిస్ మ్యాగీని సీఎం రేవంత్ రెడ్డి సన్నిహిత ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్లు ఇబ్బంది పెట్టారని మాజీ మంత్రి హరీశ్ రావు అంటున్నారని చెప్పారు. మీ వద్ద వీడియో ఫుటేజ్ ఉంటే బయట పెట్టండంటూ బీఆర్ఎస్ నేతలను ఆయన డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వాన్ని బద్నం చేయడానికి మిస్ ఇంగ్లాండ్ మ్యాగీతో బీఆర్ఎస్ పార్టీ నేతలు అలా మాట్లాడించారేమో అంటూ సందేహం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు అనారోగ్యం కారణంగా ఆమె ఇంగ్లాండ్ వెళ్ల వలసి వచ్చిందని చెబుతున్నారన్నారు. ఈటల రాజేందర్ ఇంటి లోపల ఈటల రాజేందర్ రెడ్డి అని, గేటు బయటకు రాగానే ఓబీసీ నాయకుడు అని ఆయన వ్యంగ్యంగా అన్నారు.








