Mahaa Daily Exclusive

  జీవో 49 అమలు కాకుండా చూస్తాం ఆదివాసీ గిరిజనులకు మంత్రి జూపల్లి హామీ ..!

Share

ఆదిలాబాద్, మహా

ప్రభుత్వం జారీ చేసిన జీవో 49ను అమలు కాకుండా చూస్తామని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఉట్నూర్ లోని ఐటీడీఏ మీటింగ్ హాల్ లో గిరిజన పెద్దలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గిరిజనులను ఇబ్బందులకు గురిచేసే జీవో 49ను పూర్తిగా రద్దు చేయాలని ఎమ్మెల్యే లు, గిరిజన పెద్దలు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఆ జీవోకు సంబంధించి ప్రభుత్వం ఇంకా గెజిట్ విడుదల చేయలేదని.. ఈ విషయం అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారని గుర్తు చేశారు. ఇదే సందర్భంలో ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ ఇప్పటికే గెజిట్ విడుదల చేసిందని చెప్పారు. వెంటనే స్పందించిన మంత్రి అటవీ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీతో ఫోన్ లో మాట్లాడి అందరికి వినిపించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గిరిజనులకు అన్యాయం చేసే ఏ పని ప్రభుత్వం చేయదని చెప్పారు. గిరిజనుల హక్కులు వాపస్ తీసుకోదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సదరు జీవోను నిలుపుదల చేసేందుకు ఎంత వరకైనా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశం లో ఎమ్మెల్యే లు వెడ్మ బొజ్జు పటేల్,కోవ లక్ష్మి, హరీష్ బాబు, కలెక్టర్లు రాజర్శి షా, వెంకటేష్ దొత్రే, ఐటీడీఏ పీఓ కుష్బు గుప్తా, స్పెషల్, ఎస్పీ లు అఖిల్ మహాజన్, క్రాంతి లాల్ పాటిల్, డిఎఫ్ఓ లు ప్రశాంత్ భాజీరావు పాటిల్, నీరజ్ కుమార్ టిబెరెవాల్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.