భద్రాచలం, మహా.
జీవో నెంబర్ 49 రద్దు అంశంపై మంత్రి సీతక్కకు మావోయిస్టుల పేరిట వచ్చిన హెచ్చరిక లేఖపై ఆమె స్పష్టమైన స్పందన వ్యక్తం చేశారు. ఈ లేఖ నిజంగా మావోయిస్టు పార్టీ నుంచి వచ్చిందా, లేదో స్పష్టత లేదని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, ఈ లేఖను ఆధారంగా చేసుకొని కొన్ని రాజకీయ పార్టీలు, పత్రికలు, మీడియా సంస్థలు అసత్య ప్రచారాలను నిర్వహిస్తున్నాయని మండిపడ్డారు.
సమాజంలో ఒక మహిళపై అసభ్య పదజాలాన్ని వినియోగించడం బాధాకరమని, “ఒక మహిళను పట్టుకొని సిగ్గులేదా అని రాయడం ఏమంతా జర్నలిజం?” అంటూ ఆమె తీవ్రంగా విస్మయం వ్యక్తం చేశారు. తనను టార్గెట్ చేస్తూ ఎన్నికల నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పుడు అదే శక్తులు కొత్త రూపంలో తనపై దాడికి తెగబడుతున్నాయని తెలిపారు.
కోయ మహిళకు జనరల్ పోర్ట్ ఫోలియోపై అసూయ
“75 ఏళ్లలో మొట్టమొదటిసారిగా ఒక కోయ మహిళకు జనరల్ పోర్ట్ ఫోలియో లభించడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే నన్ను లక్ష్యంగా తీసుకొని తప్పుడు ప్రచారాలు, వీడియోలు సృష్టిస్తున్నారు” అని ఆమె పేర్కొన్నారు. జీవో 49ను తాను స్వయంగా వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేసిన మంత్రి, గిరిజన సంక్షేమ మంత్రిగా రాజకీయ భేదాలు లేకుండా అన్ని పార్టీలకు చెందిన ఎస్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై జీవోను రద్దు చేయాలని తీర్మానం చేసినట్లు వివరించారు.
“నేను ఆదివాసి బిడ్డే.. వారి సంక్షేమమే నా లక్ష్యం”
“ఏ హోదాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా… నేనే ఒక అడవి బిడ్డ. నా జీవితం ఆదివాసుల అభివృద్ధికే అంకితం. వారిని దోచుకునే వ్యవస్థలకు, అధికారుల అహంకారానికి అడ్డుగావుతున్నా” అని పేర్కొన్నారు. కొంతమంది అధికారం మించిన అధికారులు ఆదివాసులపై దాడులకు దిగుతున్న ఘటనలు తన దృష్టికి రాగానే వెంటనే స్పందించి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పీసీసీఎఫ్ సువర్ణలతో మాట్లాడినట్లు వెల్లడించారు.
“పోడు భూములపై ప్రేమ ఉన్నా, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మౌనం?”
“బీఆర్ఎస్ పాలనలో ఆదివాసుల గుడిసెలను కూల్చారు. మోసగాళ్ల ప్రేమ ఇప్పుడు మోసలి కన్నీటి రూపంలో ఒలకబోస్తోంది. చంటి పిల్లల తల్లులను జైళ్లకు పంపించారు. చెట్లకు కట్టేసి కొట్టారు. ఇప్పుడు వారే మానవత్వం గురించి మాట్లాడడం వినడానికి విడ్డూరంగా ఉంది” అంటూ సీతక్క ఘాటుగా స్పందించారు.
జీవో 49ను రద్దు చేయాలని తాను గళమెత్తానని, రాజకీయ ప్రతిష్ఠతో ఆ జీవోను నిలిపివేయడం జరగలేదని విమర్శించారు. ఆదివాసుల పట్ల ఉన్న ప్రేమను రాజకీయ లబ్దికోసం ఉపయోగించడాన్ని ఆమె తప్పుబట్టారు.
“నన్ను ఓడించేందుకు వంద కోట్లతో కుట్రలు – కానీ ప్రజలే నా బలం”
“ఎన్నికల సమయంలో నన్ను ఓడించేందుకు వంద కోట్ల రూపాయలతో కుట్రలు చేసినా… ములుగు ప్రజలు నన్ను విశ్వసించి రికార్డు మెజార్టీతో గెలిపించారు. అదే నాకు అసలైన శక్తి” అని అన్నారు. తనకు లభించిన మంత్రి పదవితో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు, పేదల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
“మావోయిస్టులకు సూచన – నిజాలు మాత్రమే చెప్పండి”
మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖను పరోక్షంగా ఉద్దేశిస్తూ, “ఎవరు మాట్లాడినా… కనీసం నిజాలు మాట్లాడాలి. అర్ధం లేని ఆరోపణలతో, అసత్య ప్రచారాలతో ఎవరికీ మేలు జరగదు” అంటూ హితవు పలికారు.








