ఖమ్మం సిటీ, మహా.
ప్రగతిశీల యువజన సంఘం (పీ.వై.ఎల్) ఖమ్మం జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 28న ఖమ్మం నగరంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు జిక్కుల భరత్ మాట్లాడుతూ – ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు ఇచ్చిన ఉద్యోగ హామీలు మర్చిపోయాయని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రం రెండూ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చినా అమలు జరగలేదని తెలిపారు.
రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం పెరుగుతోందని, యువత చెడు అలవాట్లలోకి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా జనరల్ కౌన్సిల్‌లో నిరుద్యోగ సమస్యపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. ఈ సమావేశాన్ని యువత పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డివిజన్, నగర అధ్యక్ష కార్యదర్శులు రమేష్, ధరణ్, అశోక్, రవీందర్, నాయకులు చందు, శివలాల్, రవి పాల్గొన్నారు.








