Mahaa Daily Exclusive

  గ్రామాలు సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకోవాలి సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి -జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్…!

Share

ఆదిలాబాద్, మహా

పోలీసులు మీ కోసంలో భాగంగా గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలను ఏర్పర్చుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని పోలీసు కార్యాలయాలు, అధికారులు, సిబ్బందితో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎలక్షన్లకు పకడ్బందీగా ఏర్పాట్లు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని సూచించారు. గ్రామాలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా నిమిషాల వ్యవధిలో సమాచారం అందేలా e చూసుకోవాలన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చే ఫిర్యాదుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ బాధితులకు న్యాయం చేకూర్చాలని తెలిపారు. ప్రతి ఒక్క గ్రామానికి విలేజ్ పోలీసు ఆఫీసర్ ను కేటాయించి ఆ గ్రామాలలో పోలీసు అధికారుల పేర్లు గోడలపై రాయించాలన్నారు. ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు స్టేషన్ హౌస్ అధికారి సంఘటనా స్థలాన్ని పరిశీలించి సరైన దర్యాప్తు చేయాలని దీనివల్ల పోలీసులపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు. ఈరోజు నుండి ఆరు నెలల పాటు ఆపరేషన్ ముస్కాన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో ఇద్దరు సీఐలు పద్మ, అంజమ్మ ఆధ్వర్యంలో రెండు బృందాలు ఆదిలాబాద్, ఉట్నూర్ లో బాల కార్మికుల నిర్మూలన పై కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. దుర్మార్గంగా వ్యవహరిస్తూ బాలల చేత వెట్టిచాకిరి చేపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా డయల్ 100 సేవలపై పోలీసు మీకోసం కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పించాలని, పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ప్రజలకు నమ్మకం కలిగించాలని వివరించారు. జిల్లాలో నెలరోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు. పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్కరూ పద్ధతి ప్రకారం యూనిఫామ్ ధరించి విధులు నిర్వహించాలని సూచించారు.నేరాల నియంత్రణకై ప్రత్యేకంగా రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండాలని, రాత్రి సమయాలలో ఫింగర్ ప్రింట్ పరికరం ద్వారా అనుమానితులను పరిశీలిస్తూ ఉండాలని తెలిపారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉండాలని సూచించారు. జిల్లాలో పూర్తిస్థాయిలో అసాంఘిక కార్యక్రమాలను రూపుమాపే దిశగా పోలీసు వ్యవస్థ పటిష్టమైన చర్యలు చేపడుతూ, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
మాదక ద్రవ్యాలను, గంజాయి లాంటి వాటిని జిల్లాలు రూపుమాపే దిశగా గట్టి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువులు లేకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. ధాబాలలో ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా పర్యవేక్షించాలన్నారు. గత నెలలో జరిగిన నేరాలు, నమోదైన కేసులు, కేసుల దర్యాప్తు, కోర్టు నందు శిక్షలు, పెండింగ్లో ఉన్న కేసుల వివరాలపై క్షుణ్ణంగా సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన కేసుల దర్యాప్తు పూర్తి చేసి నేరస్తులకు శిక్షలు పడినప్పుడే బాధితులకు పోలీసు వ్యవస్థ ద్వారా న్యాయం లభిస్తుందని చెప్పారు. ఎలాంటి సమాచారమైన జిల్లా పోలీస్ ముఖ్య అధికారికి అందజేయాలంటే 8712659973 నెంబర్ కు వాట్సప్ ద్వారా సమాచారాన్ని అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి. సురేందర్ రావు, ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్.జీవన్ రెడ్డి, సిహెచ్ నాగేందర్, హసిబుల్లా, సీఐ లు, ఎస్సై లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Latest