భూపాలపల్లి, మహా :
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులు పరిష్కరానికి తహశీల్దార్లు మరింత ఫోకస్ చేయాలని, షెడ్యూల్ సిద్ధం చేసి నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తహసీల్దార్లను ఆదేశించారు.
శుక్రవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో భూ భారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు పరిష్కారానికి తీసుకున్న చర్యలు, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ ప్రగతిపై రెవెన్యూ, గృహ నిర్మాణ, పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్లతో మండలాల వారీగా భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల వివరాలు, నోటీసులు జారీ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
దరఖాస్తుల పరిష్కారానికి తగిన షెడ్యూల్ సిద్ధం చేసి, దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేయాలని, నోటీసుల్లో సూచించిన తేదీన విచారణ పూర్తి చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో 48,651 దరఖాస్తులు వచ్చాయని, కానీ ఇప్పటి వరకు 1600 నోటీసులు జారీ చేశారని వేగం పెంచాలని కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 15వ తేది వరకు భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన అన్ని దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉన్నందున అంతకుముందే దరఖాస్తుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దరఖాస్తులు పరిష్కారంలో పురోగతి చాలా తక్కువగా ఉందని వేగం పెంచాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం గురించి ప్రస్తావిస్తూ ఇండ్ల నిర్మాణానికి మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని డిఆర్డీఓకు సూచించారు. ఇళ్ళు నిర్మాణానికి ఇసుక కొరత లేదని దశల వారిగా నిర్మాణ ప్రగతిపై నిధులు జమ జరుగుతుందని జాప్యం చేయక నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 4779 ఇండ్లు మంజూరు అయ్యాయని 1558 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని, 2794 ఇళ్లు మంజూరు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. మంజూరు ఉత్తర్వులు జారీ చేసిన ఇండ్లు నిర్మాణం చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీఓ రవి, డిపిఓ వీరభద్రయ్య, డిఆర్డీఓ బాలకృష్ణ, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపిడీఓలు తదితరులు పాల్గొన్నారు.








