మంచిర్యాల, మహా : కోటపల్లి తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న అక్కిరెడ్డి నవీన్ రాజారాం గ్రామానికి చెందిన నరేష్ అనే రైతు నుండి 10 వేల రూపాయలు లంచంగా తీసుకుంటూ ఆదిలాబాద్ ఏసీబీ డిఎస్పి మధు చిక్కిన వైనం శుక్రవారం కలకలం రేపింది. అదిలాబాద్ ఏసీబీ డి.ఎస్.పి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా, కోటపల్లి మండలం, రాజారాం గ్రామానికి చెందిన నరేష్ అనే రైతు తనకున్న 20 గుంటల వ్యవసాయ భూమికి పట్టా పాస్ పుస్తకంలో పేరు సరి చేయడం కొరకు కోటపల్లి డిప్యూటీ తాసిల్దార్ నవీన్ ను గత మూడు రోజుల క్రితం కలిశాడని తెలిపారు. అయితే దానికి 15 రూపాయలు లంచంగా ఇస్తేనే సరి చేస్తానని నవీన్ రైతుకు చెప్పినట్లు వివరించారు. కాగా తన వద్ద అన్ని డబ్బులు లేవు అని బ్రతిమిలాలగా చివరికి పదివేల రూపాయలు ఇవ్వాలని డిప్యూటీ తాసిల్దార్ డిమాండ్ చేసినట్లు చెప్పారు. దీనితో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలిపారు. అంజి అనే ఓ వ్యక్తి ద్వారా శుక్రవారం 10 వెలు తీసుకుంటుండగా డిప్యూటీ తాసిల్దార్ నవీన్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీనితో కేసు నమోదు చేసుకొని వీరిరువురిని కోర్టుకు హాజరు పరుచనున్నట్లు పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తున్న అధికారులు ఎవరైనా పనులు చేయాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేస్తే తమ శాఖకు సమాచారం అందించాలని ఆయన తెలిపారు. ఇది ఇలా ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఒకవైపు ఉన్నత చదువులు చదివిన యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తల్లాడిందుతుంటే, పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహించే ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేసి కాటకటాల పాలవడం పై ప్రజలు మండిపడుతున్నారు.
ఇప్పటికైనా వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు మాని ప్రజలకు సేవలందించాలని కోరుతున్నారు.








