Mahaa Daily Exclusive

  బల్దియా సర్వసభ్య సమావేశంలో నగరాభివృద్ధి పై రచ్చ సమావేశం నుంచి బిఆర్ఎస్ కార్పోరేటర్ ల బైకాట్ భద్రకాళి చెరువు అభివృద్ధి పనుల పై బిఆర్ఎస్ గరం ..!

Share

వరంగల్ మహా;
బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో సోమవారం నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన  కౌన్సిల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో బల్దియా వ్యాప్తంగా పన్నులు పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యంగా లేదని, నగరంలో చేపట్టిన అభివృద్ధి, అండర్ డ్రైనేజీ పనులు, అసంపూర్ణంగా ఉన్నాయని, ముఖ్యంగా భద్రకాళి  చెరువు అభివృద్ధి పనుల్లో అవకతవకలు, భారీ అవినీతి జరిగిందంటూ  బిఆర్ఎస్ పార్టీ  కార్పొరేటర్లు చర్చకు పట్టు పట్టగా ఈ అంశాలపై మేయర్ తో సహా అధికార పార్టీ నేతలు పూర్తి వివరణ ఇవ్వ లేదంటూ భారాస డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం తో పాటు కార్పొరేటర్లు కౌన్సిల్ సభ ను మధ్యలోనే  బైకాట్ చేసారు.
అనంతరం
నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన నిర్వహించిన  కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన 23 ఎజెండా అంశాల రూ.139.29
కోట్ల అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ
రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి వరంగల్ మహా నగర సమగ్రాభివృద్ధి కోసం  కనివిని ఎరుగని రీతిలో నిధుల మంజూరు చేస్తున్నారని తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో పెద్దఎత్తున రూ. 139.29 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపడం జరిగిందన్నారు.
అందులో ముఖ్యమైనవి సాధారణ నిధులు (జనరల్ ఫండ్స్) ద్వారా రూ.62.15 కోట్లతో అంచనాలు రూపొందించి, డివిజన్కు రూ.50 లక్షల చొప్పున రూ.33 కోట్లు,  ఇతర పనులకు రూ.24.05 కోట్లు, హంటర్రోడ్ 12 మోరీల కూడలి అబివృద్దికి రూ.2 కోట్లు, రూ.2 కోట్లు వీధి దీపాలకు, రూ. 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.18.18 కోట్లు ఖర్చు చేయనున్నామని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన స్టాంపు డ్యూటీ నిధుల ద్వారా కొత్తగా అభివృద్ది పనులు ప్రతిపాదించడం జరిగిందని,
రూ.41.56 కోట్లు డివిజన్లకు, భద్రకాళి చెరు వులో మ్యూజికల్ లైటింగ్కు రూ.13.50 కోట్లు, అమృత్ 2.0 పథకం ద్వారా రూ.14 కోట్ల ఎస్సీఎం నిధులలో  రూ.6 కోట్లతో ఆస్తిపన్ను అసెస్మెంట్లపై సర్వే, రూ.4 కోట్లతో స్మార్ట్ నీటి సరఫరా యంత్రాలు, రూ.4 కోట్లతో నిల్వ వ్యర్థాల శుద్దీకరణకు కేటాయించడం జరిగిందని తెలిపారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పేద మధ్యతరగతి వర్గాల సొంతింటి కల సాకారం చేసిన సీఎం  శ్రీ.రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. వరంగల్ మహా నగరంలోని 66 డివిజన్లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజలు, నిర్మాణ పనులు చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. గ్రేటర్ వరంగల్ పరిధిలో సుమారు 8 వేల పై చిలుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన ముఖ్యమంత్రికి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి, జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న  శాసన సభ్యురాలు కొండా సురేఖ, అలాగే పంచాయితీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) , గౌరవ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రానున్న రోజుల్లో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్ళను  మంజూరు చేస్తామని అలాగే
రేషన్ కార్డులు మంజూరు చేయుటకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని  అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని నాలుగు ఏళ్ళ మన పాలకవర్గం పదవీకాలం మీ అందరి సహకారంతో దిగ్విజయంగా పూర్తయిందని ఇక మిగిలిన ఏడాదిలో నగరంలోని 66 డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అందరూ కలసికట్టుగా పనిచేద్దామని  ప్రతి డివిజన్ కు 50 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు.  హన్మకొండ ప్రాంతంలో కీలకమైన నయీంనగర్ నాలా విస్తరణ, అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల ఈ ఏడాది కొంత ముంపు బెడద ఉండదని భావిస్తున్నాను. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో 45 లోతట్టు ప్రాంతాలను గుర్తించి, కాలనీలు ముంపునకు గురి కాకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగింది.
గ్రేటర్ వరంగల్ లోని 35 నాలాల్లో పూడికతీత తీయడం జరిగింది. ప్రతి డివిజన్ కు వారానికి రెండు రోజులపాటు జెసిబి కేటాయించి అసిస్టెంట్ ఇంజనీర్ సమక్షంలో నాలాల్లో పూడికతీత వంటి అత్యవసర పనులు చేపట్టడం జరుగుతున్నది. మహా నగరంలోని 66 డివిజన్లో 340 ప్రధాన అంతర్గత డ్రైనేజీలలో కూడా పూడికతీత పనులు చేపట్టడం జరిగింది. కాలనీల్లో కురిసే  వర్షపు నీరు సవ్యంగా నగరం దాటేందుకు అన్ని రకాలుగా సిద్ధం చేశామన్నారు. ముంపు సమస్యల పై స్వీకరించిన ఫిర్యాదుల తక్షణ పరిష్కార నిమిత్తం బల్దియా ప్రధాన కార్యాలయంలో 24×7 కంట్రోల్ రూమ్  ఏర్పాటు చేయడంతో పాటు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. అలాగే డి.ఆర్.ఎఫ్ అత్యవసర బృందాలు గత నెల రోజులుగా నగరంలో తిరుగుతున్నాయి. వరద ముంపు కాలనీల్లో ఎలాంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనేందుకు బల్దియా ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేయడం జరిగింది.
బల్దియా వ్యాప్తంగా రహదారు లలో ఏర్పడిన గుంతలను  ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టేలా, వీధి దీపాలు సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు, పనిచేయని వీధి దీపాల స్థానంలో కొత్తవి  అమర్చే ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి  పరిశుభ్రత, ప్రజారోగ్యం ప్రధాన లక్ష్యంగా మున్సిపాలిటీలలో ప్రతిష్టాత్మకంగా జూన్ 2వ తేదీ నుండి చేపట్టిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ లో 51 అంశాలతో రోజువారి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నాం.100 రోజుల కార్యక్రమాల్లో భాగంగా గ్రేటర్ వరంగల్లోనెలకొన్న సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతున్నది.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా 66 డివిజన్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఎప్పటికప్పుడు ఫాగింగ్ చేయడం నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ వదలడం, చెట్ల పొదలు తొలగించడం  మొదలగు చర్యలు చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు.
ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవంలో భాగంగా బల్దియా ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 15 లక్షల 50వేల మొక్కలు నాటడానికి 13 నర్సరీలలో సిద్ధం చేస్తూ ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది.66 డివిజన్లో ప్రతి ఇంటికి 6 చొప్పున వివిధ రకాల 10 లక్షల పూల, పండ్ల, అలంకరణ   మొక్కలను పంపిణీ చేయడం జరుగుతుంది.  దీనికి తోడుగా కరీంనగర్, ములుగు, నర్సంపేట, ఖమ్మం గ్రాండ్ ఎంట్రన్స్ లలో మొక్కలు   నాటడంతోపాటు, కార్పొరేషన్ పరిధిలో గల 38 పార్కులలో, పాత మీడియన్ లలో గ్యాప్ ఫిల్లింగ్, కొత్త మీడియన్ లలో మొక్కలు  నాటడం జరుగుతుంది. 66 డివిజన్లో అవెన్యూ ప్లాంటేషన్ కూడా ఏర్పాటు చేయుటకు ప్రణాళిక సిద్ధం చెయ్యడం జరిగింది.
గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా ప్రజలకు మెరుగైన మంచినీటి సరఫరా చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వ  మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ప్రోత్సాహకంగా అమృత్ 2.0 క్రింద గ్రేటర్ వరంగల్ కు 10 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.
గ్రేటర్ వరంగల్ లోని గృహాల  ఇంటి పన్ను, పారిశుద్ధ్యం, తదితర వివరాల డేటాబేస్డ్రోన్ సర్వే, ఇతర నూతన సాంకేతికత ద్వారా మ్యాపింగ్ చేయుటకు 6 కోట్ల రూపాయలను, నగర వ్యాప్తంగా స్కాడ్ టెక్నాలజీ ఉపయోగించి లీకేజీలను, నీటి వృధా అరికట్టుటకు, మంచినీటి సరఫరాను మరింత బలోపేతం చేయడానికి 4కోట్ల రూపాయలతో   ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే, ప్రొసీడింగ్లు అందజేత, రేషన్ కార్డుల సర్వే విజయవంతంగా నిర్వహించుటకు సహకరించిన గౌరవ ఎమ్మెల్సీలకు, గౌరవ ఎమ్మెల్యేలకు, గౌరవ కార్పొరేటర్లకు, కృషిచేసిన బల్దియా కమిషనర్ కు, అధికారులకు సిబ్బందికి ఈసందర్భంగా అభినందనలు తెలిపారు.
అంతకుముందు బల్దియా ప్రధాన కార్యాలయం లో  పునరుద్ధరించిన కౌన్సిల్ హాల్ ను  నగర మేయర్ గుండు సుధారాణి తో కలిసి శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కే ఆర్ నాగరాజు,రేవూరి ప్రకాశ్ రెడ్డి, బల్దియా కమిషనర్, చాహత్ బాజ్ పాయ్ లతో కలసి ప్రారంభించారు.
ఈ సమావేశంలో బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, డిప్యూటీ మేయర్ రిజ్వాన మసూద్ షమీం  కార్పొరేట్లతో పాటు బల్దియా కు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ఎన్ పిడిసిల్, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest